
Australia : వన్డే వరల్డ్ కప్ 2023లో అన్ని జట్లకన్నా మెరుగ్గా కాదు, అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా చివరి మ్యాచ్ లో చేతులెత్తేయడంతో అందరి కలలు కల్లలైపోయాయి. అయితే ఆస్ట్రేలియా విజయం సాధించినా సరే, వారందరూ కూడా ఇండియా కి మాత్రమే ఈసారి కప్ కొట్టే అర్హత ఉందన్నట్టు మాట్లాడారు. మన క్రికెటర్లకి మానసిక స్థయిర్యాన్ని ఇచ్చారు. నిజంగా వారు గెలిచిన సంతోషం ఉన్నా, ఇండియాకి రాలేదన్న బాధ వారిలో కనిపించింది.
ఒకరిద్దరూ ఆ విషయంలో బయటపడ్డారు కూడా…నిజానికి వారిప్పటికే ఐదుసార్లు కప్ గెలిచారు. వారు ఇప్పుడు గెలవడం వల్ల వారికి ఒరిగిందేమీ లేదు. కానీ ఇండియా గెలిచి 20 ఏళ్లవుతుంది. అదీ కాక మొదలెట్టిన దగ్గర నుంచి పదికి పది మ్యాచ్ లు కూడా ఏక పక్షంగా విజయం సాధించింది. ఇది నిజంగా నిరాశపరిచేదేనని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా క్రీడాస్పూర్తితో చెప్పడం విశేషం.
ముఖ్యంగా ఇండియా విజయానికి అడ్డంగా నిలిచి సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ఓపెన్ అయ్యాడు. ఓటమితో బాధపడుతున్న రోహిత్ శర్మను ఓదార్చేలా హెడ్ మాట్లాడాడు.. ఈ క్షణం భూమ్మీద అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మ మాత్రమేనని అన్నాడు. అతడి క్యాచ్ అందుకోవడం గొప్పగా అనిపించింది. ఆ క్యాచ్ నేను పట్టకపోయి ఉండుంటే.. అతడు సెంచరీ చేసేవాడేమో అని హెడ్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ అయిన తర్వాత మాట్లాడుతూ ఇండియా చాలా కఠినమైన పిచ్ మీద బ్యాటింగ్ చేసిందని అన్నాడు. ఈ పిచ్ మీద ఇంత స్కోర్ చేయడం మాటలు కాదని అన్నాడు. కొహ్లీ, రోహిత్, రాహుల్ చాలా బాగా ఆడారని ప్రశంసించాడు.
ఈసారి వరల్డ్ కప్ లో పాల్గొన్న జట్లలో పలువురు ఆటగాళ్లు స్పందించారు. నిజానికి వరల్డ్ కప్ గెలిచే అర్హత టీమ్ ఇండియాకి మాత్రమే ఉందని అన్నారు. టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి ఉండవచ్చుగానీ, ఆటగాళ్లుగా మత్రం ఓడిపోలేదన్నారు. నిజంగానే టీమ్ ఇండియాకి దురదృష్టకరమైన రోజు అని చెప్పాలి.