
Rohit Sharma : వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియాపై ఓటమితో భావోద్వేగానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పిచ్ ని నిందించాల్సిన పనిలేదని అన్నాడు. అందరూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లని తెలిపాడు. ఎలాంటి పిచ్ పైనైనా ఆడాల్సిందేనని అన్నాడు. ముఖ్యంగా బ్యాటర్లు అవసరానికి తగినట్టుగా ఆడలేదని అన్నాడు.
బౌలింగ్ విభాగంలో కూడా మూడు వికెట్లు తీశాక, ఐదుగురు బౌలర్లు కూడా ప్రభావం చూపించలేక పోయారని అన్నాడు. త్వరత్వరగా వికెట్లు తీయలేకపోయాం. రాత్రిపూట ఫ్లడ్ లైట్ల వెలుగులో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఇది మా అందరికీ తెలుసు. అందుకోసం మేం ఎక్కువ టార్గెట్ ఇవ్వాలి. కనీసం ఇంకో 30 పరుగులైనా చేసుంటే, కొంచెం వారిపై ఒత్తిడి ఉండేది.
అన్నింటికన్నా మించి ట్రావిస్ హెడ్ వికెట్ తీయలేకపోయాం. స్టార్టింగ్ లో తనపై ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. మరోవైపు లబూషేన్ కంప్లీట్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయి, టెస్ట్ మ్యాచ్ లా ఆడాడు. వీళ్లు 15 ఓవర్లు నిలబడేసరికి పిచ్ నెమ్మదిగా టర్న్ అయ్యింది. బాల్ బ్యాట్ మీదకి వచ్చింది. వారు ఈజీగా పరుగులు తీశారని అన్నాడు.
అరివీర భయంకరంగా కనిపించిన ముగ్గురు పేసర్లు కూడా తేలిపోయారని రోహిత్ తెలిపాడు. అయితే ఇది నిజంగా బ్యాటర్ల ఫెయిల్యూర్ మాత్రమేనని అన్నాడు. ఒకటి నుంచి మొదలుపెడితే ఏడుగురు వరకు బ్యాటింగ్ ఆర్డర్ అంత పటిష్టంగా ఉందని అన్నాడు. ఇంతమందిని పెట్టుకుని ఎవరిని నిందించాలి? అని ప్రశ్నించాడు. ఓటమికి కుంటిసాకులు చెప్పలేనని అన్నాడు.
కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకోవడం 140 కోట్ల మంది భారతీయులను కదిలించింది. తనతోపాటు సిరాజ్, కులదీప్ కూడా ఎమోషనల్ అయ్యారు. కోహ్లీ మూడాఫ్ లోకి వెళ్లిపోయాడు.
యువ ప్లేయర్లు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మాత్రం ముఖాలు చూపించలేకపోయారు. చాలా అవమాన భారాన్ని వారిద్దరూ మోసారు. క్రీజులోకి వచ్చాక ఎంతో జాగర్తగా ఆడాల్సిన మ్యాచ్ లో ఎంత నిర్లక్ష్యంగా ఆడారు…దానికీ రోజు యావద్భారతదేశం ఎంత బాధపడింది? వారిపై ఎంత బాధ్యత ఉందనే జీవిత సత్యం ఈరోజున వారికి బోధపడినట్టుగా కనిపించింది.