IND VS ENG: భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడవ టెస్ట్ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడవ మ్యాచ్ లో నాలుగవ రోజు ఆట ముగిసింది. ఆదివారం స్టంప్స్ పడే వరకు భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందాలంటే మరో 135 పరుగులు అవసరం. భారత్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగుల వద్ద ముగిసింది.
Also Read: MI New York: ముంబైని ఎవ్వడు ఆపలేడు.. 13వ సారి టైటిల్ సొంతం…
రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 40, బెన్ స్టోక్స్ 33, హ్యారీ బ్రూక్ 23, క్రాలీ 22 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే మహమ్మద్ సిరాజ్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ చెరో వికెట్ తీశారు.
భారత జట్టుకు ఆదిలోనే షాక్:
కాగా 193 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్ నాలుగు వికెట్లను కోల్పోయింది. భారత స్కోర్ ఐదు వద్ద ఉండగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో యశస్వి జైష్వాల్.. జేమీ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఖాతా కూడా తెరవకుండానే జైష్వాల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇద్దరు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి మంచి షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డుని పరుగులెత్తించారు.
రెండవ వికెట్ కి వీరిద్దరూ 66 బంతుల్లో 36 పరుగులు జోడించారు. ఇక బ్రైడెన్ కార్స్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 33 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 14 పరుగులు చేసిన కరున్ నాయర్ ని.. బ్రైడెన్ కార్స్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ గిల్ రెండవ ఇన్నింగ్స్ లో పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కార్స్ బౌలింగ్ లోనే గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం నైట్ వాచ్ మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్ {1} కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆకాష్ ని బెన్ స్టోక్స్ బౌల్డ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 2, ఆర్చర్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: Goldberg retirement: WWE గోల్డ్ బెర్గ్ సంచలన నిర్ణయం..షాక్ లో ఫ్యాన్స్
24 పరుగులు బైస్:
ఇక ఐదవ రోజు భారత జట్టు మరో 135 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఒకవేళ వికెట్లను కోల్పోతే మాత్రం మూడవ టెస్ట్ లో ఓటమి తప్పదు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో భారత బౌలర్లు ఏకంగా 24 పరుగులు బైస్ కింద సమర్పించుకున్నారు. ఈ పరుగులు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. 1.1 ఓవర్ల వద్ద నాలుగు పరుగులు, 11.5 వద్ద మరో నాలుగు, 23.6 వద్ద 4, 24.1 వద్ద 4, 33.5 వద్ద 4, 35.1 వద్ద 4 పరుగులు.. ఇలా మొత్తంగా 24 పరుగులు ఎక్స్ట్రా గా సమర్పించుకున్నారు. దీంతో ఈ పరుగులే ఇప్పుడు టీమిండియా కొంప ముంచబోతున్నాయని అంటున్నారు క్రీడాభిమానులు. మరి ఈ ఐదవ రోజు ఇంగ్లాండ్ ని తట్టుకొని భారత్ నిలబడుతుందా..? అనేది వేచి చూడాలి.