Big Stories

IPL2024 GT vs DC: 89కే ఆలౌట్.. అరె! గుజరాత్ కి ఏమైంది..? ఆడుతూ పాడుతూ గెలిచిన ఢిల్లీ

IPL 2024 32nd Match Gujarat Titans vs Delhi Capitals: పిచ్ ఎంత టర్న్ తిరుగుతున్నా, ఇంత దారుణంగా ఎవరైనా అవుట్ అయిపోతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతటి ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా ఇలా బ్యాట్ లు సంకలో ఎట్టుకుని, తలదించుకుని వచ్చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఇదంతా ఎవరి కోసమని అనుకుంటున్నారా? ఇంకెవరు గిల్ నాయకత్వంలో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ గురించి నెట్టింట వినిపిస్తున్న మాటలే ఇవి…

- Advertisement -
IPL 2024 32nd Match Gujarat Titans vs Delhi Capitals
IPL 2024 32nd Match Gujarat Titans vs Delhi Capitals

ఎందుకంటారా? ఇప్పుడా జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో అహ్మాదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యింది. అందుకు బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ 8.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి ముందడుగు వేసింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ టాస్ గెలిచి మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ కి ఆది నుంచి కలిసి రాలేదు. ఫటా ఫట్.. వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఓపెనర్లు వ్రద్ధిమాన్ సాహా (2), కెప్టెన్ గిల్ (8), సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), రాహుల్ (10) షారూఖ్ ఖాన్ (0) ఇలా వెళ్లడం, రావడం, ఇలా వెళ్లడం, రావడం ఇదే వరసగా మారింది. ఒక దశలో 48 పరుగులకే 6 వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అప్పుడు రషీద్ ఖాన్ వచ్చి 24 బంతుల్లో 31 పరుగులు చేసి ఆ మాత్రం స్కోరు అయినా సాధించడంలో తోడ్పడ్డాడు. తను అవుట్ కాగానే గుజరాత్ కథ ముగిసిపోయింది. మిగిలిన వాళ్లు ఒకటి, రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు.

గుజరాత్ పతనంలో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. తను ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడమేకాదు, తన చేతుల మీదుగా మరో ఇద్దరిని అవుట్ చేశాడు.

మొత్తానికి గుజరాత్ 17.3 ఓవర్లలోనే 89 పరుగులకు చాప చుట్టేసింది.

ఢిల్లీ బౌలింగులో ముఖేష్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టన్ స్టబ్స్ 2, అక్షర్ పటేల్ 1, ఖలీల్ అహ్మద్ 1 వికెట్లు పడగొట్టారు.

లక్ష్య ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. గుజరాత్ బ్యాటర్లు ఎందుకలా? అవుట్ అయ్యారనే ఆలోచన లేకుండా ఆడింది. త్వరత్వరగా ఓపెనర్లు ప్రధ్వీ షా (7), జాక్ ఫ్రేజర్ (20)లను కోల్పోయింది. తర్వాత అభిషేక్ పోరెల్ (15), షే హోప్ (19) అవుట్ అయి కాసేపు టెన్షన్ పెట్టారు. 67 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి గుజరాత్ దారిలోనే నడుస్తున్నారా? అనిపించింది.

Also Read: ఛేజింగ్ లో సెంచరీల వీరుడు.. జోస్ బట్లర్

కానీ కెప్టెన్ రిషబ్ పంత్ (16 నాటౌట్), సుమిత్ కుమార్ (9 నాటౌట్) తో కలిసి జాగ్రత్తగా ఆడి జట్టుని గట్టెక్కించాడు. 8.5 ఓవర్లలో 92 పరుగులు చేసి మ్యాచ్ ని గెలుపు తీరాలకు చేర్చాడు.

గుజరాత్ బౌలింగులో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్ పట్టికలో 6వ స్థానానికి వెళ్లింది. గుజరాత్ 7వ స్థానంలోకి పడిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News