
IPL Match Updates (Sports News): ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. 5 వరుస పరాజయాల తర్వాత తొలి విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతికష్టం మీద గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా సరిగ్గా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ జెసన్ రాయ్ (43), రసెల్ (38) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మన్ దీప్ సింగ్ (12) మినహా మిగతా 8 మంది బ్యాటర్లలో కనీసం ఒక్కరూ కూడా పట్టుమని 10 పరుగులు కూడా చేయలేదు. దీంతో కోల్ కతా అతి తక్కువ లక్ష్యాన్ని మాత్రమే ఢిల్లీ ముందు ఉంచగలిగింది.
ఢిల్లీ పేసర్లు, స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్ కతా బ్యాటర్లు తడబడ్డారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ , నోకియా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినా ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే ముందుకు సాగింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57) హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మనీష్ పాండే (21), అక్షర్ పటేల్ (19 నాటౌట్) వార్నర్ కు సహకరించారు. లక్ష్యం చిన్నదే అయినా ఈ మ్యాచ్ కూడా 20వ ఓవర్ వరకు సాగింది. చివరిలో ఢిల్లీ జట్టు విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి రెండు బంతుల్లో 7 పరుగులు రావడంతో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ , నితీశ్ రాణా రెండేసి వికెట్లు తీశారు. పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.