
Dhoni Comments: ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీ ఒక్కసారి పెదవి విప్పాడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించని ధనాధన్ ధోని మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా వరుస విజయాలను ప్రస్తావిస్తూ ధోనీ ఒక మాట చెప్పాడు.
ఇంకా ఇండియా ఆడాల్సిన మ్యాచ్ లను పరిగణలోకి తీసుకుంటే మరో రెండు గెలిస్తే సెమీస్ లోకి వెళతాం. అయితే ఆ తర్వాత మరో రెండు గెలవాల్సి ఉంటుంది. అదే సెమీఫైనల్, ఫైనల్….ఇలా మొత్తం నాలుగు మ్యాచ్ లను ఇండియా గెలిస్తే కప్ మనదేనని అన్నాడు.
ఇప్పుడు ఇండియా టీమ్ అన్నిరంగాల్లో పటిష్టం కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, అటు ఫీల్డింగ్, ఇంకా ఆల్ రౌండర్ల ప్రతిభ, వికెట్ కీపింగ్, క్యాచ్ లు పట్టడం ఏ రకంగా చూసినా సరే, అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. అందుకని కప్ గెలిచే సత్తా, అర్హత ఇండియా టీమ్ కి ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను…ఇంతకు మించి ఏం చెప్పనని అన్నాడు.
2011 తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ ప్రపంచకప్ ను గెలవలేదు. అంతేకాదు 2019లో ఇలాగే వరుసగా రోహిత్ సెంచరీలతో దుమ్మురేపుతూ సెమీస్ వరకు వెళ్లి అక్కడ బొక్కబోర్లా పడింది. బహుశా అది కూడా ధోనీ గుర్తు చేసుకున్నాడు. 2019లో మనం వరల్డ్ కప్ గెలిచి ఉంటే నేనెంతో సంతోషించే వాడినని అన్నాడు. ఆ రోజు నాకు అదెంతో సంతోషాన్నిచ్చేదని గుర్తు చేసుకున్నాడు. ఆ బాధ మాత్రం నాలో ఉండిపోయిందని అన్నాడు.
ధోనీ ఎందుకలా అన్నాడంటే, అదే ధోనీ ఆఖరి మ్యాచ్, రిటైర్మెంట్ కూడా…అందుకనే గెలిచి ఉంటే సచిన్ లా తను కూడా సగర్వంగా క్రికెట్ కి వీడ్కోలు చెప్పేవాడు. అది తనకి మిగల్లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించిన ధోనీకి రిటైర్మెంట్ మాత్రం ఘనంగా జరగలేదని కామెంట్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసిందని చెబుతున్నారు. వాడుకున్నంత సేపు వాడుకుని, ఇండియన్ క్రికెట్ ని అత్యున్నత శిఖరానికి తీసుకువెళ్లిన ధోనీని సరిగా గౌరవించుకోలేదనే బాధ అందరిలో ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.