T20 worldcup : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ నుంచే భారత్ నిష్క్రమించింది. టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఇంగ్లండ్ ఫైనల్ లో ప్రవేశించింది. ఆదివారం పాకిస్థాన్ తో టైటిల్ కోసం బట్లర్ సేన పోటీ పడుతుంది.
భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఊదేశారు. 16 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించారు. బట్లర్ 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 80 పరుగులు , అలెక్స్ హేల్స్ 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 86 పరుగుల చేసి అజేయంగా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. భారత్ బౌలర్ల భువనేశ్వర్, షమీ, అశ్విన్, పాండ్యా దారుణంగా విఫలమయ్యారు. భారీగా పరుగులు సమర్పించారు. అర్షదీప్, అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టడంలో ఫెయిల్ అయ్యారు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 5 పరుగులకే అవుటై మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ నిదానంగా ఆడటంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది. రోహిత్ 27 పరుగులకు అవుట్ కాగా..ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులకే పెవిలియన్ కు చేరడంతో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివరల్లో హార్ధిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 4 పోర్లు, 5 సిక్సుల సాయంతో 63 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు పోరాడే టార్గెట్ ఉంచాడు. అయితే బౌలర్లు సమిష్టిగా విఫలం కావడంతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.