TTD: తిరుపతి లడ్డు. అత్యంత పవిత్రం. అత్యంత రుచికరం. ఆ కలియుగ దేవుడు వెంకన్న స్వామి ఎంత ఫేమసో.. ఆయన లడ్డూ ప్రసాదం కూడా అంతే పాపులర్. ఏళ్లుగా అదే నాణ్యత. అంతే రుచి. అంతే పరిమాణం. అలాంటిది లడ్డు సైజు తగ్గిందంటూ ఇటీవల వివాదం తలెత్తడం కలకలం రేపింది. తాను తీసుకున్న లడ్డు బరువు తక్కువగా ఉందంటూ ఓ భక్తుడు టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. విషయం తీవ్ర వివాదాస్పదమైంది. తాజాగా, లడ్డు బరువు వివాదంపై టీటీడీ స్పందించింది. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చింది.
భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుందని తెలిపింది. కానీ, ఇటీవల ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. ఇదే వివాదానికి కారణం. దీనిపైనే టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
వేయింగ్ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం వల్లే అలా జరిగిందని టీటీడీ తెలిపింది. లడ్డూ బరువు కచ్చితంగా 160 గ్రాములు ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని వందల ఏళ్ల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని నాణ్యతతో అందిస్తున్నామని.. లడ్డు సైజు, బరువులో కూడా ఎలాంటి తేడా లేదని వివరించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది టీటీడీ.