T20 World Cup : T20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు… ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లోనే షాకిచ్చారు… కంగారూలు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో జరిగిన తొలి వన్డేలో… ఇంగ్లండ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది… ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ బ్యాటర్ మలాన్ ఒక్కడే సూపర్ సెంచరీతో జట్టు స్కోరులో సగం చేసినా… జట్టును గెలిపించలేకపోయాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్… 31 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయింది. జేసన్ రాయ్, జేమ్స్ విన్స్, ఫిల్ సాల్ట్ తక్కువ స్కోరుకే ఔటవడంతో… ఇంగ్లండ్ జట్టు కష్టాల్లోపడింది. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా డేవిడ్ మలన్ మాత్రం దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. 46వ ఓవర్ దాకా ఆడిన మలన్… 128 బంతుల్లోనే 134 రన్స్ చేశాడు. అందులో 4 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. జోస్ బట్లర్, డేవిడ్ విల్లీ ఫరవాలేదనేలా ఆడటంతో… 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.. ఇంగ్లండ్. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీసుకోగా… మైకేల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ కు చెరో వికెట్ దక్కింది.
288 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, హెడ్ అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 147 రన్స్ జోడించాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో… 20 ఓవర్లలోనే 148 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ 86 పరుగులు చేయగా… హెడ్ 69 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ మిగతా బ్యాటర్లతో కలిసి గేమ్ ను ఫినిష్ చేశాడు. 78 బంతుల్లో ఒక సిక్సర్ 9 ఫోర్లతో 80 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.. స్మిత్. అయితే… సూపర్ సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ మలన్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.