Big Stories

England vs Netherlands : పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు ఇంగ్లాండ్ విజయం..

England vs Netherlands : డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వచ్చిన ఇంగ్లండ్ అసలు గెలవడమే మరిచిపోయినట్టు ఆడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఎట్టకేలకు ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పుణెలో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ చావో రేవో అన్నట్టుగానే ఆడింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. బదులుగా నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.

- Advertisement -

రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వాయిదా వేసుకుని వచ్చిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్ సూపర్ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ తరుఫున పదివేల పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి ఇంగ్లాండ్ ప్లేయర్‌గా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.

340 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్స్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. ఒక్క మన తెలుగు వీరుడు నిడమనూరు తేజ మాత్రమే 41 పరుగులు చేసి, చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ (5) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన కొలిన్ అకర్మన్ డక్ అవుట్ అయి వెనుతిరిగాడు. అప్పటికీ నెదర్లాండ్ 6.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు మాత్రమే చేసింది.

ఈ దశలో మరో ఓపెనర్ వెస్లీ బరేసీ (37) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ ఎక్కువ సేపు నిలవలేదు. తర్వాత ఎంగెల్‌బ్రెక్ట్ (33) కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (38) తప్ప ఎవరూ రాణించలేదు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 37.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో మెయిన్ ఆలీ 3, ఆదిల్ రషీద్ 3, డేవిడ్ విల్లే 2, క్రిస్ వోక్స్ ఒక వికెట్టు పడగొట్టారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ పోయిన పరువును కాపాడుకోవాలనే ధ్యాసతో ఆడింది. అంతకుమించి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలంటే కనీసం పాయింట్ల టేబుల్ లో 7 స్థానంలో ఉండాలి. దానికోసమైనా ఆడాలనే పట్టుదలతో తమ అనుభవాన్నంతా జోడించి ఆడారు. ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మళ్లీ సీన్ రిపీట్ అవుతుందా? అని అంతా అనుకున్నారు.

మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (87) ఆదుకున్నాడు. 13 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత జోయ్ రూట్ (28) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 22 ఓవర్లు పూర్తి చేసింది. అప్పుడు స్కోరు 3 వికెట్ల నష్టానికి 139 పరుగుల మీద ఉంది. ఈ సమయంలో బెన్ స్టోక్ వచ్చాడు. తన పవర్ ఏమిటో చూపించాడు. 84 బాల్స్ లో 6 సిక్స్ లు, 6 ఫోర్లతో సెంచరీ చేశాడు. 108 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు.

తర్వాత క్రిస్ వోక్స్ (51) చేసి స్కోర్ ని 300 పరుగులు దాటించాడు. అంతేకాదు 339 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలా భారీ లక్ష్యాన్ని డచ్ టీమ్ ముందు ఇంగ్లాండ్ ఉంచింది. దీంతో భారీ స్కోర్ చేధించలేక నెదర్లాండ్స్ చేతులెత్తేసింది. నెదర్లాండ్స్ బౌలింగ్ లో బాస్ డే లేన్ 3, ఆర్యన్ దత్ 2, లోగన్ వాన్ బీక్ 2, పాల్ వాన్ మీకరన్ ఒక వికెట్టు తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News