England : T20 వరల్డ్ కప్ గెలిచి పది రోజులు కూడా గడవకముందే… ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్. చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది… ఆ జట్టు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో… ఏకంగా 221 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది… ఇంగ్లిష్ టీమ్. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అతి భారీ ఓటమి. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిపోయి సిరీస్ సమర్పించేసుకున్న ఇంగ్లండ్… మూడో వన్డేలోనూ అతి ఘోరంగా ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు… ఆరంభం నుంచే చుక్కలు చూపించారు… ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. పూర్తిగా 38 ఓవర్ల పాటు ఆడిన వార్నర్, హెడ్… తొలి వికెట్‌కు ఏకంగా 269 రన్స్ జోడించారు. హెడ్ 130 బంతుల్లో 4 సిక్సర్లు, 16 ఫోర్లతో 152 రన్స్ చేస్తే… వార్నర్ 102 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 106 రన్స్ చేశాడు. అయితే, ఇద్దరూ ఒక్క పరుగు వ్యవధిలో ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపు వర్షం పడటంతో… మ్యాచ్ 48 ఓవర్లకు కుదించారు. చివర్లో మిగతా బ్యాటర్లు కూడా ధాటిగా ఆడటంతో… 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది… ఆస్ట్రేలియా.
డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 48 ఓవర్లలో 364 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఇంగ్లండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. జేసన్ రాయ్ ఒక్కడే 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్, 221 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొత్తానికి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది… ఆస్ట్రేలియా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హెడ్‌కు దక్కగా… ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వార్నర్ పట్టేశాడు.