Big Stories

FIFA Worldcup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఢీ..

FIFA Worldcup : ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ బెర్తులు తేలిపోయాయి. తుదిపోరులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ సెమీస్‌లో మొరాకోను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ ప్రారంభ నుంచి ఫ్రాన్స్ పట్టు సాధించింది. 5వ నిమిషంలోనే ఫ్రాన్స్‌ ఆటగాడు థియో హెర్నాండెజ్‌ అద్భుతంగా గోల్‌ చేశాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమించినా మరో గోల్‌ నమోదు కాలేదు. ఫ్రాన్స్‌ ఆటగాళ్లు పదే పదే మొరాకో గోల్ పోస్టుపై దాడులు చేశారు. అయినా సరే గోల్స్‌ చేయలేకపోయారు.

- Advertisement -

రెండో అర్ధభాగంలోనూ మొరాకో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. 79వ నిమిషంలో ఎంబపే నుంచి పాస్‌ అందుకున్న రాండల్‌ కోలో మువానీ గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ చివరిదాకా తీవ్రంగా శ్రమించిన మొరాకో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఈ మ్యాచ్‌లో మూడింట రెండో వంతు బంతి తన నియంత్రణలోనే ఉన్నా గోల్స్‌ చేయడంలో మొరాకో జట్టు విఫలమైంది. మూడుసార్లు మొరాకో ఆటగాళ్లు టార్గెట్ వైపు దూసుకెళ్లినప్పటికీ ఫ్రాన్స్‌ రక్షణశ్రేణిని ఛేదించలేకపోయారు. దీంతో మొరాకో జట్టుకు ఓటమి తప్పలేదు.

- Advertisement -

సెమీస్ ఓడినా మొరాకో జట్టు ప్రదర్శన ప్రతి ఫుట్ బాల్ అభిమానిని ఆకట్టుకుంది. గ్రూప్ దశలోనూ, నాకౌట్ లోనూ టాప్ జట్లకు ఈ జట్టు షాక్ ఇచ్చింది. బెల్జియం, స్పెయిన్‌, పోర్చుగల్‌ లాంటి బలమైన జట్లను ఓడించి మొరాకో ఈ ఫిఫా ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా నుంచి సెమీస్‌ చేరిన తొలి జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. సెమీస్ లో ఓడినా మొరాకో ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ జట్టు సెమీస్ లో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి ఫైనల్‌లో పెట్టింది. వరుసగా రెండోసారి కప్ ను కైవసం చేసుకునేందుకు ఫ్రాన్స్ సన్నద్ధమవుతోంది. ఆదివారం జరిగే తుది పోరులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News