Australia : T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా… శ్రీలంకపై ఘన విజయంతో ఫామ్ లోకి వచ్చింది. లంకేయులపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది… ఆసీస్.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా… ఆరంభంలో శ్రీలంకను కట్టడి చేసింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ కుశాల్ మెండిస్ వికెట్ కోల్పోయిన లంక… ఆచితూచి ఆడింది. దాంతో… తొలి 10 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత జోరు పెంచిన లంక బ్యాటర్లు… ఓవైపు వికెట్లు పడుతున్నా… ధాటిగానే ఆడారు. చివరి 10 ఓవర్లలోనే 94 రన్స్ రాబట్టారు. నిస్సంక 40, అసలంక 25 బంతుల్లో 38, ధనంజయ డిసిల్వా 23 బంతుల్లో 26, కరుణరత్నే 7 బంతుల్లో 14 రన్స్ చేయడంతో… 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది… శ్రీలంక.
158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా… 16.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో కీలక ఆటగాళ్లు ఔటైనా… ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్… ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అరోన్ ఫించ్ 31, మాక్స్ వెల్ 23, మిచెల్ మార్ష్ 18, డేవిడ్ వార్నర్ 11 రన్స్ చేశారు. 18 బంతుల్లోనే 59 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి… ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించిన స్టొయినిస్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.