Harbajan Singh: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులు చాలా క్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని, క్రికెట్ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుండి భారత్ వైదొలిగిన విషయం కూడా తెలిసిందే. సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ తో పోటీ పడాల్సి ఉండగా.. తమకు క్రికెట్ కంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుండి నిష్క్రమించారు.
Also Read: Liam Livingstone : 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్
ఇక త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్ {asia cup 2025} పైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయా..? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ {Harbajan Singh} తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా..? అంటూ బీసీసీఐ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. అందువల్ల ఇప్పటికైనా ఆసియా కప్ 2025 విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని హర్భజన్ సింగ్ సూచించాడు.
“సరిహద్దుల్లో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేరు. అందరికంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారికోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్ ని వదులుకోలేమా..? కొంతమంది సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నప్పుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్ళతో క్రికెట్ ఆడటమా..? సమస్య పరిష్కారం అయ్యేంతవరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి.
దేశ ప్రయోజనాలే మనకు ప్రధానం. గుర్తుపెట్టుకోండి.. మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానే. మీరు ఒక ఆటగాడు లేదంటే నటుడు. ఎవరైనా కానివ్వండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరపున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు” అన్నారు హర్భజన్ సింగ్. అయితే ఆసియా కప్ 2025 లో మాత్రం భారత్ – పాకిస్తాన్ ఓకే గ్రూపులో ఉండడంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు పోటీపడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.