ఆర్చర్ కి హైదరాబాద్ బ్యాటర్ల టార్చర్:
Harbhajan Singh – Jofra Archer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా ఆదివారం రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ చెత్త రికార్డు నమోదయింది. కొన్నేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్ లోనే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
రూ. 12.5 కోట్లు పెట్టి రాజస్థాన్ రాయల్స్ ఎంతో నమ్మకంతో తెచ్చుకున్న ఆర్చర్.. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. పైగా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ గా ఇది నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్ లో ఒక స్పెల్ లో ఏ బౌలర్ కూడా ఇప్పటివరకు ఇన్ని పరుగులు ఇవ్వలేదు. నాలుగు ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్చర్.. కేవలం ఒకే ఒక డాట్ బాల్ వేశాడు.
ఆర్చర్‌పై భజ్జీ జాత్యహంకార కామెంట్స్:
ఈ క్రమంలో మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరించిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఆర్చర్ ని “నల్ల టాక్సీ” తో పోల్చడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు హర్భజన్ సింగ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటువంటి జాత్యహంకార వ్యాఖ్యలు ఇక మానుకోవా..? అంటూ మండిపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆర్చర్ ఇన్నింగ్స్ లోని 18 ఓవర్ వేశాడు.
ఓవర్ లో హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రెండు ఫోర్లు బాదాడు. ఈ సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న బజ్జి.. “లండన్ మే ఖాళీ టాక్సీ కా మీటర్ తేజ్ భాక్తా హై, ఔర్ యహ పే ఆర్చర్ సహాబ్ కా మీటర్ భీ తేజ్ భాగా హై” అంటూ వ్యాఖ్యానించాడు. అంటే లండన్ లో నల్ల టాక్సీల మీటర్ వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ ఆర్చర్ మీటర్ కూడా వేగంగా పరిగెడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆర్చర్ ని నల్ల ట్యాక్సీలతో పోల్చడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఆర్చర్ రంగును ఉదేశిస్తూ హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతుంది.
దీంతో కామెంట్రీ ప్యానెల్ నుండి హర్భజన్ సింగ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై హర్భజన్ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే గతంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా హర్భజన్ ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలే చేశాడనే ఆరోపణలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. అప్పుడు ఆండ్రూ సైమండ్స్ ని కోతి అని తిట్టాడని.. ఇప్పుడు మరోసారి ఓ ఫారిన్ ప్లేయర్ పై హర్భజన్ సింగ్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కామెంట్రీ పేరుతో ఇలా నోటికి వచ్చినట్లు వాగుతున్నారని మండిపడుతున్నారు.