Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసింది. శనివారం రోజు అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఘోరంగా ఓటమిని చవిచూసి.. పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి దిగజారింది.
రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి కేవలం 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది ఎమ్ఐ. ఈ ఓటమితో కలత చెందిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తమ జట్టు చాలా తప్పులు చేసిందని అంగీకరించాడు.
” బౌలింగ్ లో మేము దాదాపు 20 పరుగులు అదనంగా ఇచ్చాము. బ్యాటింగ్ లోను దాదాపు 20 పరుగులు తక్కువగా వచ్చాయి అనుకుంటున్నాను. ఫీల్డింగ్ లో కూడా ప్రొఫెషనల్ గా లేము. మేము ప్రాథమికంగా తప్పులు చేశాం. మరోవైపు గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు కూడా పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. మా జట్టులో అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఉన్నాం.
రాబోయే మ్యాచ్ లలో రాణిస్తారని ఆశిస్తున్నా”. అని చెప్పుకొచ్చాడు. అయితే 2024 సీజన్ లో స్లో ఓవర్ రేటు కారణంగా.. 2025 ఐపీఎల్ లోని మొదటి మ్యాచ్ కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో రెండవ మ్యాచ్ కి అందుబాటులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకి మరో షాక్ తగిలింది. శనివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు జరిమానా విధించారు.
హార్దిక్ పాండ్యా పై 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ ఫైన్ కి బాధ్యుడయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలోనే స్లో ఓవర్ రేట్ రన్ చేశాడంటే.. ఇక ముందు జరిగే మ్యాచ్లలో ఎలా మైంటైన్ చేస్తాడో వేచి చూడాలి. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురైన మొదటి కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.
అయితే గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్లు వేయలేకపోయింది. దీని కారణంగా గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో వారికి జరిమానా విధించారు. ఆ ఓవర్ లో వారు 30 యార్డ్ సర్కిల్ లో ఒక ఫీల్డర్ ని అదనంగా ఉంచాల్సి వచ్చింది. కానీ ఈసారి స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ లో ఏ కెప్టెన్ ని నిషేధించరు. ఈసారి ఐపీఎల్ లో ఐసీసీ తరహా డీమెరిట్ పాయింట్స్ సిస్టం ని ప్రవేశపెట్టారు.