
IND vs AUS 2003 Match : అది 2003వ సంవత్సరం
మార్చి నెల 23వ తేదీ..
జోహెన్స్ బర్గ్, సౌతాఫ్రికా
వాండరర్స్ క్రికెట్ స్టేడియం
32 వేల మంది క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.
అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆ రోజు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
ఇండియా- ఆస్ట్రేలియా పోరాటానికి సిద్ధమయ్యాయి.
దాదా టాస్ గెలిచి అనూహ్యంగా బౌలింగ్ తీసుకున్నాడు.
అదే బ్యాటింగ్ తీసుకుని ఉండి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో.. కానీ ఆ నిర్ణయం ఒక వరల్డ్ కప్ ని దూరం చేసేసింది.
అంతవరకు వీర విహారం చేసిన ఇండియన్ పేసర్లు జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా ఆఖరి మ్యాచ్ లో తేలిపోయారు.
రికీ పాంటింగ్ (121 బంతుల్లో 140 నాటౌట్ ) ఇండియా బౌలింగ్ ని తుత్తునియలు చేశాడు. తనకి డామిన్ మార్టిన్ (88) ఫుల్ సహకారం అందించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 2 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఆ రెండు వికెట్లు కూడా హర్భజన్ కి పడ్డాయి. ఇప్పటిలా అప్పట్లో భారీ స్కోర్స్ ని చేధించే మానసిక దృక్పథం, టీ 20 ఫార్మాట్ తరహా శిక్షణ ఇలాంటివేవీ లేవు. దీంతో టీమ్ ఇండియా చేతులెత్తేసింది.
భారీ స్కోరు కావడంతో అందరూ హిట్టింగ్ చేస్తూ అవుట్ అయిపోయారు. వీరేంద్ర సెహ్వాగ్ (82) ఒక్కడూ పోరాడాడు. కానీ తను రనౌట్ కావడంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది. 39.2 ఓవర్లలోనే 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అంతవరకు అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న సచిన్ కూడా ఆ ఒక్క మ్యాచ్ లో త్వరగా అవుట్ కావడం చూసి భారతీయుల గుండెలు బద్దలైపోయాయి. ప్రతి భారతీయుడికి సచిన్ అంటే అంత అభిమానం ఉండేది. తను అవుట్ అయ్యాడంటే చాలు, సగం మంది టీవీలు కట్టేసి వెళ్లిపోయేవారు.
భారతీయుల గుండెల్లో సచిన్ వేసిన క్రికెట్ ముద్ర సామాన్యమైనది కాదు. ఈరోజు ఇండియాలో క్రికెట్ మూడుపువ్వులు-ఆరు కాయలుగా ఉందంటే, ఆనాడు 1983లో వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ టీమ్, ఆ తర్వాత, అత్యంత ప్రభావం చూపించినది ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే.. అలాంటి సచిన్ అవుట్ అయిపోయాడు. గంగూలీ, యువరాజ్, ద్రవిడ్, ఎవరూ కూడా సెహ్వాగ్ కి సపోర్ట్ గా నిలవలేదు.
ఇది ఆనాడు జరిగింది. ఇప్పుడు సచిన్ ప్లేస్ లో విరాట్ ఉన్నాడు. తను అత్యధిక పరుగులు చేశాడు. రేపు సచిన్ లా అవుట్ అవకూడదు. ఈ ఒక్కమ్యాచ్ లో కోహ్లీ నిలబడాలి. తర్వాత తనిష్టమని నెటిజన్లు కోరుతున్నారు. ఇక రోహిత్ శర్మ కూడా ఎటాకింగ్ ఆడాలి కానీ, వికెట్ వదిలేసుకునేంత గుడ్డిగా ఆడకూడదు.
శుభ్ మన్ గిల్ ఎప్పటిలా నిలబడాలి. శ్రేయాస్, రాహుల్ బ్యాట్ ఝులిపించాలి. సూర్యకి ఒకవేళ అవకాశం వస్తే మాత్రం తనని అందరూ స్కై అని ఎందుకంటారో, ఆసీస్ కి రుచి చూపించాలి. ముగ్గురు పేసర్లు కూడా 20 ఏళ్ల క్రితంలా తేలిపోకూడదు.
ఒకవేళ టాస్ గెలిస్తే అప్పటిలా లాకుండా పరిస్థితులకు తగినట్టుగా ఎంపిక చేసుకోవాలి. 20 ఏళ్ల నాటి ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలి. సెమీస్ లో కివీస్ కి ఇచ్చినట్టు ఆస్ట్రేలియాకు కూడా బదులు తీర్చేయాలి. ఇదే 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.