
Kohli Vs Shami : 711 పరుగులతో వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ దూసుకెళుతున్నాడు. మరోవైపు 23 వికెట్లతో షమీ కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా దూకుడుగానే ఉన్నాడు. మరిద్దరిలో ఎవరు టాప్ అంటే ఏం చెబుతారు? అయినా ఎందుకీ గొడవ, ఇప్పుడిద్దరూ కూడా ఇండియాకే కదా ఆడుతున్నారు. అంటే అవునండీ అవును కాకపోతే ఇందులో ఒక తిరకాసు ఉందని చెబుతున్నారు.
ఏమిటది? అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండీ మరో మూడురోజుల్లో ఫైనల్ మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మెగా టోర్నమెంట్ మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఒకటి వస్తుంది. అది ఎవరికివ్వాలనేది ఇప్పుడు ప్రశ్న.
విరాట్ కోహ్లీ వైపు చూస్తే.. ఈ టోర్నమెంట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 711 పరుగులతో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. 90కిపైగా సగటుతో ఉన్నాడు. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అప్పుడెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాల్సిందే.
ఆస్ట్రేలియాపై 85, అఫ్ఘాన్ పై 55, బంగ్లాదేశ్ పై103, న్యూజిలాండ్ పై 95, శ్రీలంకపై 88, సౌతాఫ్రికాపై 101, నెదర్లాండ్స్ పై 51, ఇంక సెమీస్‌లో కివీస్ పై 117 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ 2023లో 10 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 8 మ్యాచ్ ల్లో 50 ప్లస్ స్కోర్స్ చేశాడు. అందువల్ల మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కోహ్లికే వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.
ఇక మెగా టోర్నమెంట్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్‌గా షమీ ఇరగదీస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ.. 23 వికెట్లు పడగొట్టాడు. కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే వికెట్ రాలేదు. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు, ఇంగ్లండ్‌పై 4 వికెట్లు, శ్రీలంకపై 5 వికెట్లు, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్లాడు. ఇక కీలకమైన సెమీస్ లో కివీస్ పై విశ్వరూపం ప్రదర్శించి 7 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో ప్రపంచకప్‌లో వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికి ఇవ్వవచ్చో మీరు కూడా థింక్ చేయండి.