
ICC Hall of Fame : ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ లో ముగ్గురు క్రీడాకారులకి అత్యున్నత గౌరవం లభించింది. భారత్ నుంచి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి మహోన్నతమైన పురస్కారం లభించింది. తనతో పాటు అరవింద డిసిల్వా, భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీని హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడంటే టీ 20లు వచ్చాయి గానీ, సెహ్వాగ్ ఎప్పుడో టీ 20 ఆటని భారతీయులకి రుచి చూపించాడు. దూకుడైన ఆటకు మారుపేరుగా ఉండేవాడు. పవర్ ఫుల్ కట్ షాట్స్, మతిపోగోట్టే డ్రైవ్స్, పుల్ షాట్స్.. గ్రౌండ్ అవతలకి సింపుల్ గా కొట్టే సిక్సర్లు ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా ఉండేవాడు.
స్కోర్ బోర్డు టాప్ గేర్ లో పరుగెట్టాల్సిందే. అందుకే తనని నవాబ్ ఆఫ్ నజాఫ్ గర్ అని పిలుస్తారు. ఈ పేరెలా వచ్చిందంటే వీరూ ఢిల్లీలోని నజాఫ్ గర్ లో జన్మించాడు. అందుకే తనని అందరూ ప్రేమతో నవాబ్ ఆఫ్ నజాఫ్ గర్ అంటున్నారు. వన్డేలు, టెస్ట్ లు, టీ 20 మ్యాచ్ లు కలిపి వీరూ 17,253 పరుగులు చేశాడు. వన్డేల్లో 15, టెస్టుల్లో 23 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలున్నాయి. మొదటిది పాకిస్తాన్ మీద 2004లో 309 పరుగులు చేశాడు. రెండోది చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 319 పరుగులు చేశాడు.
మరొకటి 2009లో శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ లో కూడా వచ్చేదే. సరిగ్గా 293 దగ్గర అవుట్ అయిపోయాడు. లేకపోతే ప్రపంచ దిగ్గజ క్రికెట్ ఆటగాడు బ్రాడ్ మన్ రికార్డ్ ని దాటేసేవాడు. సెహ్వాగ్ కి ఎప్పుడు కూడా 90 పరుగుల దగ్గర సిక్స్ లు ట్రై చేస్తుంటాడు. అలాగే 293 దగ్గర ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఇవి కాకుండా 4 డబుల్ సెంచరీలున్నాయి. 150కి పైగా పరుగులు 6 సార్లు చేశాడు. భారతీయ క్రికెట్ పై దూకుడైన ఆట తీరుతో ‘నవాబ్ ఆఫ్ నజఫ్ గర్…’ చెరగని ముద్ర వేశాడు.
ఎంతోమంది మహిళలను క్రికెట్ వైపు ఆకర్షితులయ్యేలా చేసి, భారత మహిళా క్రికెట్ కు ఎనలేని సేవ చేసిన డయానా ఎడుల్జీ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పురుష, మహిళా క్రికెటర్ల గెలాక్సీలోకి భారతదేశం నుంచి చేరిన తొలి మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందింది. ఇది తనకి, తన కుటుంబానికే కాదు, బీసీసీఐకి కూడా గర్వకారణమని డయానా పేర్కొంది.
శ్రీలంక క్రికెట్ కి స్వర్ణయుగం అనుకునే సమయంలో అరవింద డిసిల్వా పేరు మార్మోగిపోయేది. మిడిలార్డర్ లో వచ్చి జట్టుకి వెన్నుముకలా ఉండేవాడు. తొలి మూడు వికెట్లు ఎంత త్వరగా పడిపోయినా సరే, సెకండ్ డౌన్ వచ్చి వికెట్లకి అడ్డంగా నిలబడిపోయేవాడు. శ్రీలంక ఒక గౌరవ ప్రదమైన స్కోరు చేసిన తర్వాత అవుట్ అయ్యేవాడు. ఈనేపథ్యంలో ఐసీసీకి అరవింద డిసిల్వా థ్యాంక్స్ చెప్పాడు.