
Pakistan : పాకిస్తాన్ క్రికెట్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే పాక్ చేరుకున్న జట్టు సభ్యులు ఎవరిళ్లకు వారు వెళ్లారు. ఏదొకరోజు వీరందరితో బోర్డు సమావేశం ఉంటుందని అంటున్నారు. అయితే అంతకుముందు కెప్టెన్ బాబర్ ఆజామ్ ని పిలుస్తారని, అతని వివరణ తీసుకుంటారని అంటున్నారు.
ఈ సమావేశానికన్నా ముందే వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ రాజీనామా చేశాడు. సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీమార్కెల్ ఆరు నెలల అగ్రిమెంట్ తో కేవలం వరల్డ్ కప్ కోసమని వచ్చాడు.
బౌలర్లకి శిక్షణ ఇవ్వడం, బ్యాట్స్ మెన్లకి కఠినమైన బాల్స్ వేసి ప్రాక్టీస్ చేయించడం తన శిక్షణలో భాగంగా బాగానే ప్రయత్నించాడు. కానీ గ్రౌండ్ లోకి వెళ్లింతర్వాత ఎవరి చేతుల్లో కూడా ఏమీ ఉండదనే సంగతి అందరికీ తెలిసిందే.
సెమీస్ ఫేవరెట్ గా బరిలో దిగిన పాకిస్తాన్, నాకౌట్ వరకు వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ 9 మ్యాచ్ ల్లో కేవలం 4 మాత్రమే విజయం సాధించింది. ఐదింట్లో ఓటమి పాలైంది. అందులో ముఖ్యంగా ఆఫ్గాన్ మీద ఓడిపోవడంతో తీవ్ర విమర్శల పాలైంది.
ఆఫ్గాన్ జట్టు వికెట్లు కూడా తీయలేనంతగా దారుణంగా బౌలింగ్ శిక్షణ ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ రాజీనామా చేశారు. ఇంతకుముందే పాకిస్తాన్ బోర్డు చైర్మన్ ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిది రెండోది..తర్వాత రాజీనామా ఎవరనేది తేలాల్సి ఉంది.
కెప్టెన్ బాబర్ ఆజామ్ పేరే గట్టిగా వినిపిస్తోంది. తను కూడా వరల్డ్ కప్ లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేస్తాడని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇందులో బాబర్ తప్పేం ఉంది? జట్టు వైఫల్యాలకి తననెందుకు బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకో కెప్టెన్ ని పెడతారు. ఇదే టీమ్ ని ఇస్తారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ అర్థర్.. జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. కెప్టెన్ గా బాబర్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. క్రికెట్ లోప్రతి మ్యాచ్, ప్రతి అవుట్, ప్రతి ఓటమి, ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పుతూనే ఉంటుందని అన్నాడు.
ఎంత గొప్పవారైనా సరే, ఓడిన ప్రతిసారి కొత్త పాఠాలను నేర్చుకునే ఉంటారని, అందుకు బాబర్ ఏమీ మినహాయింపు కాదని అన్నాడు. తనొక మంచి కెప్టెన్ గా ఎదగడానికి అందరూ సహకరించాలని అన్నాడు. ఎదురు దెబ్బలు తిన్నప్పుడే జట్టు తన పనితీరును మరింత మెరుగుపర్చుకుంటుందని అభిప్రాయపడ్డాడు. బాబర్ అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని, మొన్నటి వరకు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడనే సంగతి ఎవరూ మరువకూడదని గుర్తు చేశాడు.