
ICC Worldcup Final : ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా తిరిగి ఫైనల్ లో అడుగుపెట్టంది. కంగారూలను ఓడించి మూడవసారి కప్ సాధించాలని చూస్తోంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నవంబర్ 19 ఆదివారం నాడు ఐసీసీ ప్రపంచకప్ తుదిసమరం జరగనుంది. రెండు సార్లు టైటిల్ సాధించిన టీమ్ ఇండియా వర్సెస్ ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్‌లో అహ్మదాబాద్ పిచ్ కీలకపాత్ర పోషించనుంది. ఈ క్రమంలో పిచ్ ఎలా ఉంది? ఎవరికి అనుకూలమనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగిన వాంఖడే పిచ్ చుట్టూ వివిధ రకాల వివాదాలు చుట్టుముట్టాయి. కొత్త పిచ్ కాకుండా పాత పిచ్ సిద్ధం చేశారనే విమర్శలు కూడా చెలరేగాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా లేక బౌలింగ్‌కు అనువుగా ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు ప్రతి క్రికెట్ అభిమాని తో పాటు కామన్ ఆడియన్స్ లో సైతం ఉత్పన్నమవుతున్నాయి.
నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వీటిలో ఐదు పిచ్ లు నల్లమట్టితో తయారు చేయగా.. ఆరు పిచ్ లను ఎర్రమట్టితో తయారు చేశారు. ఫైనల్ మ్యాచ్ ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేస్తారో ఇప్పటివరకూ స్పష్టత లేదు. నల్లమట్టి పిచ్ ను ఎంపిక చేస్తే బంతి బౌన్స్ అవుతుంది. దాంతో బౌలర్లకు అనుకూలించవచ్చు. ఫైనల్ వంటి మెగా ఈవెంట్లకు నల్లమట్టిపిచ్ నే ఎక్కువగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అందుకే ఇందులో స్పిన్ కు అనుకూలించే వికెట్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన సెమీస్ లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆసిస్ బ్యాటర్లు తడబడ్డారు. స్పిన్ వికెట్ సిద్ధమైతే కచ్చితంగా టీమ్ ఇండియాకు లాభించనుంది. ఆసిస్ జట్టులో జంపా మినహా.. మరో పర్ ఫెక్ట్ స్పిన్నర్ లేరు.
అహ్మదాబాద్ పిచ్ ఇప్పటి వరకూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సహకరించింది. ప్రపంచకప్ 2023 ప్రారంభ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లో జరిగింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగితే మూడు సార్లు ఛేజింగ్ జట్టు గెలిచింది. ఈ నాలుగు మ్యాచ్‌లలో ఏ జట్టూ 300 పరుగులు దాటలేదు. ఈ ప్రపంచకప్ లో పిచ్ పై అత్యధిక స్కోర్ 286 ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు కేవలం 36.2 ఓవర్లలోనే ఛేదించింది. అహ్మదాబాద్ లో ఇప్పటివరకూ మొత్తం 32 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17 సార్లు గెలుపొందగా, పరుగులు చేజింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి.
తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉండొచ్చని స్టేట్ అసోసియేషన్ క్యూరేటర్ ఒకరు తెలిపారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందన్నారు. 315 పరుగులు చేస్తే… సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదని అభిప్రాయపడ్డారు. సో ఈ స్టేడియంలో 315 రన్స్ డిపెండబుల్ స్కోర్” యావరేజ్ తీసుకుంటే 237 పరుగులుగా ఉంది. మరోవైపు అహ్మదాబాద్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ను పరిశీలించాడు.
ఇదిలా ఉంటె ఈ మ్యాచ్‌కు సంబదించిన అంపైర్‌ల జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రకటన చూసి టీమ్ ఇండియా అభిమానులు కంగారుపడుతున్నారు. ఐసీసీ ప్రకటించిన లిస్ట్ లో ఓ ఐరన్ లెగ్ అంపైర్ ఉండటమే ఇందుకు కారణం. ఫైనల్ మ్యాచ్‌కు సీనియర్ అంపైర్‌లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకూ రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచ్ లలో టీమిండియా గెలవలేదు. దాంతో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మరి టీమ్ ఇండియా సెంటిమెంట్ కు ఈ మ్యాచ్ బ్రేక్ వేసి విజయాన్నందిస్తుందా అన్నది వేచి చూడాలి.