
ICC World Cup 2023: పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టుగా నెదర్లాండ్స్ పోరాడింది. అంత తేలిగ్గా వికెట్లు పారేసుకోలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్ చేయించాడు. అందులో తను కూడా ఒక ఓవర్ వేశాడు. శ్రేయాస్, కేఎల్ రాహుల్ తప్ప అందరూ బౌలింగ్ చేశారు.
వరల్డ్ కప్ సెన్సేషన్ బౌలర్ మహ్మద్ షమీకి ఒక్క వికెట్టు దొరక్కపోవడం ఆశ్చర్యంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లకి 410 పరుగులు చేసింది. బదులుగా డచ్ టీమ్ 250 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.
160 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.
ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇద్దరూ నెదర్లాండ్స్ బౌలర్లను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. 11.5 ఓవర్లకు 100 పరుగులు చేసి గేర్ మార్చి వదిలేశారు. ఈ సమయంలో 51 పరుగులు చేసిన గిల్ అవుట్ అయ్యాడు. అందులో 4 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే తను కొట్టిన ఒక సిక్సర్ దాదాపు స్టేడియం అవతల పడేదే…కానీ తృటిలో తప్పింది.
గిల్ అవుట్ అయిన కాసేపటికి కెప్టెన్ రోహిత్ (61) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2 సిక్స్ లు, 8 ఫోర్లు కొట్టి దూకుడు మీదే కనిపించాడు. కానీ తొందరపడ్డాడు.
అప్పుడు వచ్చిన కోహ్లీ నిదానంగా ఆడటం మొదలు పెట్టాడు. కాకపోతే మొదట్లోనే కోహ్లీకి ఒక లైఫ్ వచ్చింది. తర్వాత నుంచి ఎప్పటిలా సింగిల్స్, డబుల్స్ మీద ఫోకస్ పెట్టాడు. శ్రేయాస్ తో కలిసి స్కోర్ బోర్డుని ముందుకి నడిపించాడు. ఈ క్రమంలో 51 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఈసారి మరో సెంచరీ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు సగంలోనే ఆగిపోయాడు.
తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ తో కలిసి జట్టు స్కోరుని తుఫాన్ కన్నా వేగంగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేశారు. శ్రీయాస్ (127 నాటౌట్ ) ఉన్నాడు. కేఎల్ రాహుల్ 102 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. రికార్డ్ స్థాయిలో జట్టు స్కోరుని 400 దాటించి మొత్తంగా 410 పరుగులు చేశారు.
నెదర్లాండ్స్ బౌలింగ్ లో బాస్ డి లీడే 2, వాన్ మీకరన్ 1, వాన్ డెర్ మెర్వ్ 1 వికెట్టు తీసుకున్నారు.
లక్ష్య చేధనలో నెదర్లాండ్స్ మంచి పోరాట పటిమనే చూపించింది. మ్యాచ్ ని ఏకపక్షంగా సాగనివ్వకుండా చూసింది. ఇండియా బౌలర్లను చెమటలు కక్కేలా చేసింది. ఓపెనర్ వెస్లీ బరేసి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్ (30) తో కలిసి అకర్మన్ (35) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపగలిగాడు. కానీ త్వరగానే ఇద్దరూ అవుట్ అయిపోయారు.
అప్పటికి నెదర్లాండ్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. సైబ్రాండ్ (45) ఆకట్టుకున్నాడు. కానీ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (17) మాత్రం విఫలమయ్యాడు..
కాకపోతే నెదర్లాండ్స్ జట్టులో ఆడుతున్న మన తేలుగు కెరటం తేజ నిడమనూరు అయితే.. ఆఫ్ సెంచరీ చేశాడు. 39 బాల్స్ తో 6 సిక్స్ లు, ఒకటి మాత్రమే ఫోర్ ఉన్నాయి. లోగన్ వాన్ బీక్, వాన్ డెర్ మెర్వ్ చెరొక 16 పరుగులు చేశారు.
ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి కష్టాల కడలిలో ఈదుతోంది. అలాంటిది ఏకంగా 250 పరుగులు చేసింది. 47.5 వరకు ఆడి ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ చెరొక వికెట్త తీసుకున్నారు.
ఇది వన్డే వరల్డ్ కప్ 2023లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. అంతేకాదు ప్రత్యర్థులను గడగడలాడించిన మహ్మద్ షమీకి ఒక్క వికెట్టు కూడా పడలేదు. లైన్ అండ్ లెంగ్త్ దొరకబుచ్చుకోడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ దొరకలేదు.
సెమీస్ మ్యాచ్ కి షమీ ప్రదర్శన ఆందోళన కలిగించేదిగా ఉందని కొందరంటే, ఆటలో ఇలాంటివన్నీ కామన్ అనీ కొందరు కామెంట్ చేస్తున్నారు.