ODI : క్రైస్ట్ చర్చ్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే బుధవారం జరగనుంది. ఆతిథ్య జట్టు ఇప్పటికే సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో విలియమ్సన్ సేన విజయం సాధించింది. రెండో వన్డే వర్షార్పణం అయ్యింది. దీంతో మూడో వన్డే కీలకంగా మారింది.
గెలుపే లక్ష్యం
ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే చివరి మ్యాచ్ లోనూ కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ మ్యాచ్ 20 ఓవర్ల కూడా సాగకుండానే రద్దైంది. రెండో వన్డేలో శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్ , సూర్యకుమార్ యాదవ్ కు మాత్రమే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. దీంతో ఇదే టీమ్ తో మూడో మ్యాచ్ లో భారత్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
బ్యాటింగ్ లో జోరు పెరగాలి
తొలిమ్యాచ్ లో ధావన్, గిల్, అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రెండో మ్యాచ్ లోనూ గిల్ రాణించాడు. సూర్యకుమార్ మెరుపులు మెరిపించాడు. ఇక పంత్ ఫామ్ లో రావాల్సి ఉంది. బ్యాటర్ల సమిష్టిగా రాణిస్తేనే భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారత్ జట్టు చేయాల్సిన స్కోర్ కంటే 20-30 పరుగులు తక్కువే చేస్తోంది. ధాటిగా ఆడాల్సిన సమయంలో బ్యాటర్ల నిదానంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ల పైనా ఇదే ధోరణి కొనసాగుతోంది.
తొలి మ్యాచ్ లో 330 పరుగులు పైనే చేయాల్సిన పిచ్ పై 306 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. గెలుపు ఓటములను నిర్ణయించేవి ఈ 20-30 పరుగులే. ఆ లోపాన్ని చివరి మ్యాచ్ లోనైనా సరి చేసుకోవాలి. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేస్తే కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. అంత స్కోర్ చేయాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు మెరుగ్గా ఆడాలి. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించాలి.
బౌలర్ల తేలిపోతున్నారు
తొలి వన్డేలో 20 ఓవర్లలోపే ముగ్గురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చిన బౌలర్లు.. ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. టామ్ లాథమ్, కేన్ విలియస్సన్ ను ఏమాత్రం నిలువరించలేకపోయారు. ఈ జంట 221 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడం భారత్ బౌలర్ల ఘోర వైఫల్యాన్ని చూసిస్తుంది. చివరి వన్డేలోనైనా బౌలర్ల సత్తా చాటాలి. పేసర్లు ఆర్షదీప్ సింగ్, దీపక్ చహర్, ఉమ్రాన్ మాలిక్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. స్పిన్నర్లు చాహల్, సుందర్ మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్ కు విజయావకాశాలుంటాయి.
న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను 2-0 కైవసం చేసుకుంటుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దైనా సిరీస్ 1-0 తో దక్కించుకుంటుంది. కివీస్ కూడా గత మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగుతుందని అంచనా ఉంది.