HS Prannoy Decided to withdraw from some tournaments: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఇటీవల చికెన్ గున్యా బారినపడిన ఆయన ఇప్పటికీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రణయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చికెన్ గున్యా ప్రభావం నుంచి తన శరీరం పూర్తిగా కోలుకునేందుకు ఆట నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రణయ్ ప్రకటించాడు.
‘చికెన్ గున్యా బారినపడడంతో నా ఆరోగ్యం పాడైంది. ఇలాంటి పరిస్థితుల్లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం అసాధ్యం. నా బృందంతో చర్చించిన అనంతరం రికవరీపై దృష్టి పెట్టడానికి రానున్న కొన్ని టోర్నమెంట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. ఈ సమయంలో మద్దతుగా నిలిచిన మీకు ధన్యవాదాలు. నేను బలంగా తిరిగి వస్తాను.’ అంటూ ప్రణయ్ పేర్కొన్నాడు.
అయితే, ప్రణయ్ చికెన్ గున్యా నుంచి కోలువకోవడానికి ఎన్ని రోజులు పట్టనుంది, ఏఏ టోర్నమెంట్లకు అతను దూరంగా ఉంటాన్న విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి వారం రోజులు ముందు ప్రణయ్ చికెన్ గున్యా బారినపడ్డాడు. పూర్తి ఫిట్ గా లేకుండానే ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు. ప్రిక్వార్టర్స్ లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.