
Delhi Capitals vs Kolkata Knight Riders Live Updates: విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఓటమి పాలయ్యింది. 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కోల్‌కతా 106 పరుగులతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో కేకేఆర్ ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.
అంతకుముందు నరైన్(85), రఘువంశీ(54), రస్సెల్(41) చెలరేగడంతో 20 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
273 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ దూకుడుగా ఆడే క్రమంలో రెండో ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా(10) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లో మిచెల్ స్టార్క్.. మార్ష్‌ను అవుట్ చేసి ఈ సీజన్‌లో తొలి వికెట్ తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో అభిషేక్ పోరెల్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత ఓవర్లో స్టార్క్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఆ వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో కెప్టెన్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ దశలో పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 126 పరుగుల వద్ధ ఢిల్లీ 5వ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బంతికే అక్షర్ పటేల్ డకౌట్ అయ్యాడు. ఈ తరుణంలో స్టబ్స్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 పరుగులు చేసిన స్టబ్స్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 159 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత ఓవర్లో తొలి బంతికే నరైన్ బౌలింగ్‌లో సుమిత్ రూపంలో ఢిల్లీ 8వ వికెట్ కోల్పోయింది. 17వ ఓవర్లో రషిక్ సలామ్ అవుట్ అయ్యాడు. 166 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ రూపంలో చివరి వికెట్ కోల్పోయి 106 పరుగులతో ఓటమి చవిచూసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 4.3 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. సునీల్ నరైన్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో వరుసగా 6,6,4,0,6,4 కొట్టడంతో 26 పరుగులు వచ్చాయి. ఆ తరువాత ఓవర్లో నోకియా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్(18) అవుట్ అయ్యాడు.
నరైన్‌తో జతకట్టిన యువ క్రికెటర్ రఘువంశీ చెలరేగిపోయాడు. 6వ ఓవర్లో నరైన్ 0,4,6,0,4,4 కొట్టడంతో 18 పరుగులు రాబట్టాడు. దీంతో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జంట 8వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోర్ 100 దాటింది. 9వ ఓవర్లో 14 పరుగులు రాబట్టారు. 11వ ఓవర్లో రఘువంశీ 2 సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
39 బంతుల్లో 85 పరుగులు చేసిన నరైన్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో రఘువంశీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 27 బంతుల్లో 54 పరుగులు చేసిన రఘువంశీ నోకియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 18 పరుగులు చేసిన అయ్యర్ అవుట్ అయ్యడు. మరోవైపు రస్సెల్ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్నాడు. 19వ ఓవర్లో రింకూ సింగ్ 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో రస్సెల్(41)ను అద్భుతమైన యార్కర్‌తో ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. దీంతో 20 ఓవర్లలో కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఒక దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్ అధిగమించేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 272 పరుగుల వద్ద ఆగిపోయింది.