Venkatesh Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో ప్రతి సీజన్ లాగానే.. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా చాలామంది ఖరీదైన ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టారు. వీళ్ళపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇందులో చాలామంది ఆటగాళ్లు ఎప్పటిలాగానే నిరాశపరిచారు. ఈ లిస్ట్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఒకరు. ఇతడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ రూ. 23.75 కోట్లకు దక్కించుకుంది.
Also Read: Kamindu Mendis: ఎవడ్రా వీడు.. పెళ్ళాన్ని వదిలేసి.. IPL ఆడేందుకు వచ్చాడు ?
కానీ పేలవ ప్రదర్శనలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. గత మూడు మ్యాచ్లలో తీవ్రంగా విఫలమైన వెంకటేష్ అయ్యర్.. నాలుగవ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ – ఎస్.ఆర్.హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్ తో తనపై వచ్చిన విమర్శలకు తెరదించాడు. తన అద్భుతమైన హాఫ్ సెంచరీ తో కేకేఆర్ ని 200 పరుగులకు చేర్చాడు.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ {KKR} 150 పరుగులైనా చేస్తుందా..? అనుకున్న సమయంలో ఏకంగా డబుల్ సెంచరీ స్కోర్ చేరుకోవడంలో వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ మొదట్లో దూకుడుగా ఆడలేని వెంకటేశ్ అయ్యర్.. పది బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత తన విశ్వరూపాన్ని మొదలుపెట్టి.. ఫోర్లు, సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 29 బంతులలో 60 పరుగులు చేశాడు.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్ గత మూడు మ్యాచ్లలో పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్ ఏ తమ బలం అనుకుని బరిలోకి దిగిన సన్ రైజర్స్.. గత మూడు మ్యాచ్లలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 286 పరుగులు చేసిన హైదరాబాద్.. ఆ తరువాత జరిగిన మూడు మ్యాచ్లలో 200 పరుగులు కూడా చేయలేకపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు గత మూడు మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్లలో బౌండరీలు కొడుతున్నా.. దానిని భారీ స్కోర్ గా మలచలేకపోతున్నాడు. దీంతో ఈ సీజన్ లో 300 పరుగులు చేయాలనే సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల కోరిక.. కలగానే మిగిలిపోతుంది. అయితే ఈ సీజన్ లో 300 పరుగులు చేయాలనే హైదరాబాద్ అభిమానులకి పరోక్షంగా కౌంటర్ వేశాడు కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్.
“క్రికెట్ లో దూకుడు అంటే ప్రతి బాల్ ని బాధడం కాదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడడం. బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 పరుగులకు పరిమితం అవ్వాలని మా జట్టు కోరుకోదు. పిచ్ కండిషన్స్ బట్టి అంచనా స్కోరుకు మరో 20 పరుగులు అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం” అని అన్నాడు వెంకటేష్ అయ్యర్. దీంతో ఈ వ్యాఖ్యలు సన్రైజర్స్ హైదరాబాద్ ని ఉద్దేశించినవేనని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.