Mohammad Shami: లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మరోవైపు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అధికంగా పరుగులు ఇచ్చిన కారణంగా భారత్ కి నష్టం కలిగింది.
Also Read: Rinku Singh: యోగి ప్రభుత్వంలో రింకూ సింగ్ కు కీలక పదవి.. ఇక క్రికెట్ కు గుడ్ బై!
ఇక శార్దూల్ ఠాకూర్ ని ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఫలితంగా రెండవ ఇన్నింగ్స్ లో 370కి పైగా లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలం చెందింది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ విభాగం పై సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరూ బుమ్రాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. రెండవ టెస్ట్ కి ముందు భారత బౌలర్లకు మహమ్మద్ షమీ పలు సూచనలు చేశారు. ” భారత బౌలర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
బుమ్రాతో మిగతా బౌలర్లు మాట్లాడాలి. అతని నుండి వీరు ఎంతో నేర్చుకోవాలి. ఎలా బౌలింగ్ చేయాలనేది ప్రణాళిక వేసుకోవాలి. ప్రస్తుతం అతనికి మద్దతుగా ఉండాలి. అప్పుడే మనం సులువుగా విజయం సాధించగలం. నేను మొదటి టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్న. బౌలింగ్ విభాగం పై మరింత వర్కౌట్ చేయాలి. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ రెండవ ఇన్నింగ్స్ లో రెండేసి వికెట్లు పడగొట్టారు.
శార్దూల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు తీసినా.. అప్పటికే భారత్ చేతుల్లో మ్యాచ్ లేదు. కొత్త బంతితో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా సులభంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలి” అని పేర్కొన్నాడు మహమ్మద్ షమీ. మొత్తానికి మొదటి టెస్ట్ ఓటమి అనంతరం భారత బౌలింగ్ విభాగం పై మహమ్మద్ షమి చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read: AUS Worst Record: వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు.. 30 ఏళ్ళ ఇదే తొలిసారి..
ఇక జూలై 2న ఎడ్జ్ బాస్టన్ మైదానం వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. బుమ్రా పై పని భారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో టీం ఇండియా మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. అందుకే బుమ్రాని కేవలం 3 టెస్ట్ లలోనే ఆడించాలని భావిస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా బీసీసీఐ నుండి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ బౌలర్ లేకుండా భారత్ జట్టు రెండవ టెస్టులో ఏమేర రాణిస్తుందో వేచి చూడాలి.