Mohammed Shami missing from India squad for 1st Test vs Bangladesh: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ.. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. బహుశా ఫిట్ నెస్ నిరూపించు కోవడంలో విఫలమవడంతో తీసుకోలేదని అంటున్నారు. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే జట్టును ఎంపిక చేయడంతో అందరిలో టెన్షను మొదలైంది.
అజిత్ అగార్కర్ నేత్రత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. సెలక్షన్ ప్రక్రియలో దులీప్ ట్రోఫీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా పేసర్ యశ్ దయాళ్ కి అవకాశం దక్కింది. బహుశా మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో యశ్ కి తొలిసారి టీమ్ ఇండియాలో ఆడే అవకాశం దక్కిందని అంటున్నారు.
ఇకపోతే రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ పై సెలక్షన్ కమిటీ ప్రత్యేక ద్రష్టి పెట్టింది. తనని తొలి టెస్టుకి ఎంపిక చేసింది. ఇంతకుముందు చక్కగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే వీరిద్దరూ ఎక్స్ ట్రా ప్లేయర్లుగానే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో సర్ఫరాజ్ ఆడినప్పుడు విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ అందుబాటులో లేరు. అందుకే తనకి అనుకోకుండా అవకాశం వచ్చింది. దానిని సర్ఫరాజు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడా ఇద్దరూ జట్టులోకి వచ్చారు. దీంతో సర్ఫరాజు 11మందిలో ఉంటాడా? లేదా? అనేది సందేహమే అంటున్నారు.
Also Read: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్
ఇక ధ్రువ్ జురెల్ విషయానికి వస్తే, ఆల్రడీ రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకున్నారు. అలాగే స్టాండ్ బైగా కేఎల్ రాహుల్ ఉన్నాడు. అందువల్ల ధ్రువ్ కూడా బెంచ్ కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు.
ఇకపోతే ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఆరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ కూడా ఎంపికయ్యాడు. ఎందుకంటే దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ తరఫున ఆడిన ఆకాశ్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు.
ఇకపోతే చెన్నై వేదికగా తొలి టెస్టు సెప్టెంబరు 19-23 మధ్య జరుగుతుంది. అలాగే రెండో టెస్టు వచ్చేసరికి కాన్పూరు వేదికగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు జరగనుంది.
తొలిటెస్టుకి ఎంపికైన ఆటగాళ్లు వీరే… కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్