Mohammad kaif Comments: భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటను, టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి తిరుగులేదని కైఫ్ పేర్కొన్నాడు. అతడి బాటలోనే ప్రస్తుతం రోహిత్ శర్మ ముందుకు వెళ్తున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ కూడా సాంకేతిక అంశాలను క్రికెట్ లో వాడుకోవడంలో ముందుంటారని కైఫ్ తెలిపాడు. ధోనీ మిగతా వారందరికీ మినహాయింపు.. రోహిత్ కూడా ఇందులో మాస్టర్స్ చేసినట్లు తనకు అనిపిస్తోందంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
‘ఆటలో టెక్నాలజీని, కామన్ సెన్స్ ను బ్యాలెన్స్ చేయడాన్ని ధోనీ, రోహిత్ సాధించారు. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేదానిపై కంప్యూటర్ కూడా అంచనా వేయలేదు. ఆటగాళ్లు, సిబ్బంది ఎన్నిసార్లు చర్చించినా అనవసరం. మ్యాచ్ రోజు తీవ్ర ఒత్తిడిలోనూ ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ఇది అత్యంత కీలకం. అప్పుడే మనం మానసికంగా ఎంత బలంగా ఉన్నామన్నది తెలియజేస్తుంది. ఈ విషయంలో ధోనీని మించిన ఉదాహరణ మరెవరూ లేరు. టీమ్ లీడర్ గా ధోనీ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. చివరి ఓవర్ సమయంలో బౌలర్ తీవ్ర ఒత్తిడిలో ఉంటాడు. అయితే, ఈ సమయంలో ధోనీ ఉండే విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకవేళ బౌలర్ సిక్స్ ఇచ్చినా కూడా మరొక బంతి వరకూ వెయిట్ చేయ్ అని ధోనీ చెబుతుంటాడు. ఇలా అందరూ చెప్పలేరు. ఈ విధంగా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తే వారి మైండ్ సెట్ కూడా మారిపోయి, మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంటది’ అంటూ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
Also Read: ఐర్లాండ్ తో మ్యాచ్ లో.. ఓపెనర్ ఎవరు? కీపర్ ఎవరు?
జూన్ 5న ఐర్లాండ్ తో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ ను ఆడనున్నది. బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ తరువాత క్రికెటర్లు సరదాగా గడిపారు. అయితే, భారత్ ఆడేటువంటి క్రికెట్ మ్యాచ్ లకు ఉగ్ర ముప్పు ఉందనే వార్తల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్లేయర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.