Navjot Singh Sidhu: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం రోజు ఆస్ట్రేలియా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ నాకౌట్ మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఒక ఎండ్ లో బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధుల మీద విరుచుకుపడ్డాడు.
మరో ఎండ్ లో ఉన్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద ఉన్న ప్రెషర్ ని తీసేసాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ 34 బంతులలో 42 పరుగులు చేసి భారత జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే ఈ టోర్నమెంట్ లో అతడి బ్యాటింగ్ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభించిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఐదు లేదా ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి దిగడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజాగా కేఎల్ రాహుల్ ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ {Navjot Singh Sidhu} పొగడ్తలతో ముంచెత్తాడు.
జట్టుకు ఏ అవసరం ఉన్నా కేఎల్ రాహుల్ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాడని అన్నాడు. రాహుల్ గురించి ఓ కార్యక్రమంలో సిద్దు మాట్లాడుతూ.. ” ఓ స్పేర్ టైర్ ని కూడా కేఎల్ రాహుల్ లా వాడి ఉండరు. మీరు అతనితో వికెట్ కీపింగ్ చేయిస్తారు, ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి దింపుతారు, ఒక్కొక్కసారి ఓపెనింగ్ కి పంపిస్తారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చిందంటే పేసర్లను తట్టుకోవడానికి మూడవ స్థానంలో వెళ్ళు అని పంపిస్తారు. ఒక్కోసారి ఓపెనింగ్ కూడా చేయిస్తారు.
వన్డే క్రికెట్ లో ఓపెనింగ్ చాలా తేలిక. కానీ టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అత్యంత కష్టమైన పని. మీకు ఎక్కడ క్లిష్టంగా ఉంటుందో.. అక్కడ ఆడమని రాహుల్ ని పంపిస్తారు. దానికి రాహుల్ అంగీకరిస్తాడు. అతడిది నిస్వార్ధమైన ఆట. దేశం కోసం నిస్వార్ధంగా త్యాగం చేసేవారు గొప్పవారు. భగత్ సింగ్ కూడా ఇలాగే చేశారు. అందుకే ఆయనకు ఎంతగానో పేరు వచ్చింది” అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు సిద్దు.
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన బ్యాటింగ్ స్థానంపై స్పందిస్తూ.. ” నేను బ్యాటింగ్ చేయడానికి ఆస్వాదిస్తాను. అయితే జట్టు అవసరాన్ని బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్ లో 5వ స్థానంలో ఆడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను కింద ఆడిస్తున్నారు. జట్టు గెలుపు కోసం కెప్టెన్ రోహిత్ ఏది చెబితే అదే చేస్తున్నాను. నేను ఎక్కడ బ్యాటింగ్ చేస్తున్నా అనేది చాలామంది మరిచిపోతున్నారు. నా పర్ఫార్మెన్స్ ని పట్టించుకోవడం లేదు. తగిన గుర్తింపు కూడా దక్కడం లేదు. అయినప్పటికీ నాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం. జట్టు గెలుపు కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉంటాను” అని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్.