Karimnagar News: వాళ్లిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇష్టపడ్డారు.. చివరకు ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ వరకు వారిద్దరు అనుకున్నట్లుగానే జరిగింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. అమ్మాయి పేరెంట్స్ లవ్ మ్యారేజ్‌ని అంగీకరించలేదు. ఈలోకంలో ఉండకూడదని ఇద్దరు నిర్ణయించుకోవడం, ఆపై సూసైడ్ చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన కరీంనగర్‌లో జరిగింది.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన 24 ఏళ్ల అరుణ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇక అమ్మాయి విషయానికొద్దాం. అదే మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన 21 ఏళ్ల అలేఖ్య. ఫ్రెండ్ ద్వారా యువతికి అరుణ్‌కుమార్ పరిచయం అయ్యాడు. తొలుత ఏర్పడిన పరిచయం ఫ్రెండ్ షిప్‌గా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇరువురు లవ్‌లో ఉన్నారు.
అలేఖ్య ఇంట్లో
సీన్ కట్ చేస్తే.. అలేఖ్యకు పెళ్లీడు రావడంతో ఆమె ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు పేరెంట్స్. ఓ సంబంధం సెట్ అయ్యింది. ఉగాది తర్వాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రేమించిన యువకుడితో వివాహం జరగదని భావించింది అలేఖ్య. ప్రియుడు లేకుండా తాను ఉండలేనని నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం కరీంనగర్‌కు వచ్చింది. వావిలాల పల్లిలో అద్దె ఇంట్లో ఉన్న అరుణ్‌కుమార్‌ని కలిసి ఇంట్లో జరుగుతున్న పెళ్లి గురించి చెప్పింది. అంతకుముందే తన ప్రేమ ప్రస్తావన గతంలో ఇంట్లో చెప్పింది. అందుకే ఏ మాత్రం అంగీకరించలేదు.
కరీంనగర్‌లో ఏం జరిగింది?
తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకోనని ప్రియుడితో తేల్చి చెప్పింది అలేఖ్య. మ్యారేజ్ గురించి ఇద్దరు మధ్య చర్చ జరిగింది. ఈ సమస్యకు ముగింపు పెట్టాలంటే ఒక్కటే శరణ్యమని భావించారు. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. బుధవారం రాత్రి అరుణ్‌కుమార్ అద్దెకున్న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అలేఖ్య-అరుణ్‌కుమార్‌ల ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయిపోయింది. అనుమానం వచ్చిన అలేఖ్య కుటుంబసభ్యులు గురువారం కరీంనగర్‌కు వచ్చారు. అలేఖ్య ఉన్న ఇంటి గురించి తెలుసుకుని అక్కడికి వచ్చారు. గదిలో వీరిని విగత జీవులుగా చూసి షాకయ్యారు.
పోలీసులు రంగ ప్రవేశం
అలేఖ్య-అరుణ్ లను ఆ విధంగా చూసి బోరున విలపించారు. వీరు ఆత్మహత్య గురించి తెలియగానే పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఘటనా స్థలానికి వచ్చి మృత దేహాలను పరిశీలించి, పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలేఖ్య తల్లి గృహిణి కాగా, తండ్రి అంజయ్య ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లారు. అలేఖ్యకు ఓ సోదరి, ఒక తమ్ముడు ఉన్నారు. అలేఖ్య కుటుంబం గడిచిన ఐదేళ్లుగా చొప్పదండిలో నివాసం ఉంటోంది. ఇక అరుణ్‌కుమార్ తల్లి స్వరూప గృహిని కాగా, తండ్రి రవి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు.
కరీంనగర్‌లో అలేఖ్య-అరుణ్ డెడ్ బాడీలకు శవ పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత వారి స్వగ్రామాల్లో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రి వద్ద ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఇలాంటి విషయాల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అంతేగానీ ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదన్నారు స్థానికులు.