Neeraj Chopra qualifies for Finals of men’s Javelin Throw event at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో.. హాకీలో స్వర్ణం లేదా రజతం వస్తుందని అనుకుంటే, ఆ అవకాశం పోయింది. అది కూడా కాంస్యం రేసులో పడిపోయింది. అయితే మరోచోట స్వర్ణం వచ్చే అవకాశం ఒకటి మిణుకుమణుకుమని మెరుస్తోంది. ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఒక్కసారి బళ్లెం విసిరి ఏకంగా ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు.
జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-బీలో నీరజ్ చోప్రా.. ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించాడు. ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు జరిగే ఫైనల్ ఈవెంట్‌లో వ్యవహారం తేలిపోనుంది.
మరో భారత ప్లేయర్ కిశోర్ జెనా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈటెను 80.73 మీటర్లను మాత్రమే విసిరాడు. 12వ ప్లేస్ లో ఉండిపోయాడు.
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచి భారత్ పేరును నీరజ్ చోప్రా మార్మోగేలా చేశాడు. ఈసారి మాత్రం గ్రౌండులో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఏ హడావుడి లేకుండా ధనాధన్ పరుగెత్తి తొలి ప్రయత్నంలోనే బళ్లాన్ని 89.34 మీటర్ల దూరం విసిరాడు. జావెలిన్ త్రో లో మహామహులు అందరూ తన వెనుకే నిలుచున్నారు.
ఇదే దూరం మళ్లీ ఫైనల్ లో విసిరితే, స్వర్ణం గ్యారంటీగా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఒలింపిక్స్ లో 84 మీటర్ల మార్క్ ను చేరితే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అలాంటిది నీరజ్ ఏకంగా 89.34 మీటర్లు విసిరాడు.
Also Read: పారిస్ ఒలింపిక్స్.. పతకం రాకుండా వినేశ్ ఫొగాట్‌పై కుట్ర, అనర్హత వేటు!
టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. ఈసారి అంతకన్నా దూరమే విసిరాడు. మరి విసరాల్సిన సమయంలో విసిరితే రికార్డులతో పాటు స్వర్ణం కూడా భారత్ వశమవుతుంది.
గ్రూప్ బీలో నీరజ్ తర్వాత పీటర్స్ 88.63 రెండో స్థానంలో నిలిచాడు. గ్రూప్ ఏలో చూస్తే వెబర్ 87.76 మీటర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వీరందరికన్నా నీరజ్ ముందంజలో ఉన్నాడు. మరి ఫైనల్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.