Big Stories

Hardik Pandya : లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు

Hardik Pandya : నిప్పులు చిమ్ముకుంటూ.. నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరే..
నెత్తురు కక్కుకుంటూ.. నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే.. – శ్రీశ్రీ

- Advertisement -

ఈ మాటలు హార్దిక్ పాండ్యాకు కరెక్టుగా సరిపోతాయి. లోకం తీరు ఎటువంటిదో నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు.. నేడు పాండ్యా జీవితంలో అక్షర సత్యాలుగా మారాయి. ఒక్క ఆరు నెలల కాలంలోనే ఈ రెండు పార్శ్వాలను హార్దిక్ చూసేశాడు. తనపై రాళ్లు విసిరిన లోకాన్ని చూశాడు. నేడు అదే చేతులతో పూలు జల్లుతున్న వైనాన్ని చూస్తున్నాడు.

- Advertisement -

అందుకే టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వేసి, మ్యాచ్ ని గెలిపించిన క్షణం.. కన్నీరుమున్నీరయ్యాడు. అంతకాలం తను పడిన మానసిక వేదన ఒక్కసారి కన్నీటి ఉప్పెనయ్యింది. నిజానికి ఆ ఓవర్ అటూ ఇటూ అయి ఉంటే, చరిత్రలో ఒక చేదు జ్ణాపకంగా హార్దిక్ మిగిలిపోయేవాడు. తన కెరీర్ ని పణంగా పెట్టి, ప్రాణం పెట్టి మరీ ఆఖరి ఓవర్ వేశాడు. ప్రపంచకప్ తెచ్చాడు.

ఒకసారి తన జీవితంలో ఆరునెలల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2023 వన్డే వరల్డ్ కప్ లో తగిలిన గాయం నుంచి కోలుకుని వచ్చాడు. అప్పుడే ఐపీఎల్ లో కెప్టెన్సీ వివాదం మొదలైంది. గ్రౌండులోకి వస్తే చాలు, కొన్ని వేల మంది ఇకలింపులు, అవమానాలు, వెకిలి చేష్టలు, ఇంక నెట్ లోకి వెళితే, తిట్లు, ఛీత్కారాలు, ట్రోలింగులు, మార్ఫింగులు ఇలా ఒకటి కాదు, అన్నింటిని తట్టుకున్నాడు. మౌనంగా భరించాడు. గుండెల్లో బడబాగ్నిని దాచుకుని బయటకి మాత్రం నవ్వుతూ కనిపించాడు.

Also Read : టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

మరోవైపు ఇంట్లో కుటుంబ కలహాలు మొదలై, అన్నీ ఒకేసారి దాడి చేశాయి. దీంతో ఇంటా బయట సమస్యసలతో నలిగిపోయాడు. ఐపీఎల్ లో ముంబయి జట్టుకు ఘోర అవమానం.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకి పోయింది. ముంబై కెప్టెన్ గా పాండ్యా ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ చూసినప్పుడు లోకం అంతా ఒకవైపు, పాండ్యా ఒక్కడు ఒకవైపు అన్నట్టు అయిపోయింది.

కట్ చేస్తే.. టీ 20 ప్రపంచకప్ హీరోల్లో ఒకడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇప్పుడదే లోకం తనని ఆకాశానికెత్తేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ‘మీకు జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలైనా తగలనివ్వండి.. పడిపోయిన ప్రతీసారి గొప్పగా తిరిగి రావాలి’.. అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు వెల్ డన్ హార్దిక్ అంటూ అభినందిస్తున్నారు.

అన్నిటికి మించి హార్దిక్ పాండ్యాకు ముంబయిలో ఆయన ఇంటివద్ద ఘన స్వాగతం లభించింది. తాను నివసిస్తున్న రెసిడెన్సీకి చేరుకోగానే సొసైటీ సభ్యులు అతడిపై పూల వర్షం కురిపించారు. బ్యాండ్ బాజాలు, బాణాసంచాతో ఘనంగా స్వాగతం పలికారు. ఇవన్నీ చూసిన నెటిజన్లు.. ఇదే లోకం తీరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News