Rohit Sharma World Record : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకి మాత్రమే సాధ్యమైన ఒక రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కలిపి 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అంతేకాదు టీ 20 ప్రపంచకప్ పోటీల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి రోహిత్ శర్మ నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ తో 600 సిక్సర్లు కొట్టిన వీరుడిగా నిలిచాడు.
2007 నుంచి ఇంతవరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 473 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. వీటిలో 499 ఇన్నింగ్స్ లో 600 సిక్సర్లు కొట్టాడు. తన తర్వాత స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ ఆఫ్రిది (476), మెక్ కల్లమ్ (398), మార్టిన్ గఫ్తిల్ (383) టాప్ 5 స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత తరంలో క్రికెట్ ఆడెవారెవరూ కూడా రోహిత్ శర్మ దరిదాపుల్లో లేరు.
ఇంగ్లండ్ టీ 20 కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం 330 సిక్సర్లతో 9వ స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో ఉంటే, రికార్డుల రారాజు మాత్రం 294 సిక్సర్లతో 12వ స్థానంలో ఉన్నాడు.
Also Read : ఇక్కడ 140 పరుగులు చేసినా గొప్పే: రోహిత్
టీ 20 ప్రపంచకప్ లో 1000 రన్స్ పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తన ముందు విరాట్ కొహ్లీ (1142), మహెల జయవర్థనే (1016) ఇంతకుముందు ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా ప్రారంభ ఎడిషన్ నుండి టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్న శర్మ 1,015 పరుగులు చేశాడు. వీటిలో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ లో 4000 పరుగుల మైలు రాయి దాటిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. తనకన్నా ముందు విరాట్ కొహ్లీ (4038), రోహిత్ శర్మ (4025) ద్వితీయ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (4023) మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే తక్కువ బంతుల్లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా 5 శతకాలు, 30 అర్ధశతకాలు చేసిన వీరుడిగా నిలిచాడు.