Sai Sudharsan vs Abhishek Sharma: టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2025 లో సన్రైజర్స్ హైదరాబాద్ {SRH} కి ప్రతినిత్యం వహిస్తున్న విషయం తెలిసిందే. IPL 2024 సీజన్ లో అద్భుతంగా రాణించడం, ఓపెనర్ గా అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ జట్టు విజయాలలో కీలకంగా మారడంతో IPL 2025 మెగా వేలంలో అభిషేక్ శర్మని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అంటిపెట్టుకుంది. ఇక గత సీజన్ లో అదరగొట్టిన అభిషేక్.. ఈ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొలి 5 మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి SRH జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ తో 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని.. సన్రైజర్స్ హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసి ఈ సీజన్ లో రెండవ విజయాన్ని నమోదు చేసింది.
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141 పరుగులు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ లో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్ సన్, మనీష్ పాండే తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలో భారత జట్టుకు మరో డాషింగ్ ఓపెనర్ దొరికాడంటూ ప్రశంసలు అందుకున్నాడు.
అయితే అభిషేక్ శర్మ కంటే గుజరాత్ టైటాన్స్ లో అసలు సిసలు రాక్షసుడు ఉన్నాడని.. అతడు బ్యాటింగ్ కి దిగితే బౌలర్లకు చుక్కలేనని ఓ గుజరాత్ బ్యాటర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అతడు ఎవరో కాదు సాయి సుదర్శన్. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో నిలకడకు మారుపేరుగా మారిన సాయి సుదర్శన్.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడి.. అందులో 74, 63, 49, 5, 82, 56 స్కోర్లు చేశాడు.
54.83 సగటుతో 329 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ పై నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ సాయి సుదర్శన్ అంటూ కొనియాడుతున్నారు. సాయి సుదర్శన్ తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతడు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్, కుడి చేతి లెగ్ బ్రేక్ బౌలర్. 20 సంవత్సరాల వయసులో అతడు తమిళనాడు తరపున టీ-20 అరంగేట్రం చేశాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021 లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక సాయి సుదర్శన్ ఇప్పటికే టీమిండియా తరఫున వన్డే, టి-20 అరంగేట్రం చేశాడు. ఆడిన 3 వన్డేలలో 63.50 సగటుతో 127 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత సాయి సుదర్శన్ కి అనూహ్యంగా జట్టులో చోటు దక్కలేదు. కానీ ఐపీఎల్ 2025 లో ఇప్పుడు నిలకడగా సత్తా చాటి మళ్లీ టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నాడు.