Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఊహించని పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. గురువారం రోజు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
అసాధారణ బౌలింగ్ తో సన్రైజర్స్ హైదరాబాద్ ని తక్కువ స్కోరుకే కట్టడిచేశారు లక్నో బౌలర్లు. ఆ తర్వాత విధ్వంసకర బ్యాటింగ్ తో అలవోకగా విజయాన్ని అందుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును దెబ్బతీశాడు లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్. మూడవ ఓవర్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ, మొదటి మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ ప్లే లో పరుగుల విధ్వంసానికి గండి పడింది.
ప్రణాళికబద్ధంగా పుల్లర్ లెంగ్త్ డెలివరీలతో ఈ ఇద్దరు బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. వీరిలో ఎవరో ఒకరు పవర్ ప్లే పూర్తయ్యే వరకు ఆడినా ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్ లో మొత్తంగా 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్ లో 2, ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాడు శార్దుల్ ఠాకూర్.
ఇలాంటి ఆటగాడిని గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదంటే ఆశ్చర్యమే. ఆ తరువాత రీప్లేస్మెంట్ గా లక్నో సూపర్ జెయింట్స్ లోకి వచ్చి ఏకంగా కెరీర్ బెస్ట్ ని కూడా నమోదు చేశాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్ లో కొన్ని జట్లతోపాటు వాటి యాజమాన్లు కూడా అభిమానుల మనసులో అలా ఉండిపోతారు. తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వాటిని చూడడానికి వచ్చి మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తుంటారు.
వీరిలో లక్నో ఓనర్ సంజీవ్ గోయంక ఒకరు. ఈయన తరచూ మ్యాచ్ జరిగే స్టేడియంలో కనిపిస్తూ ఉంటారు. ఇతనిది కాస్త డిఫరెంట్ స్టైల్. తన జట్టు చెత్త ప్రదర్శన చేస్తే ఆటగాళ్లను మందలిస్తూ మీడియాకి చిక్కుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే లక్నో తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో రిషబ్ పంత్ కి క్లాస్ పీకుతూ దర్శనమిచ్చాడు. ఇక రెండవ మ్యాచ్లో గెలుపొందిన అనంతరం కూడా కెమెరాలన్నీ సంజీవ్ పైనే ఫోకస్ చేశాయి.
ఈ క్రమంలో ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆటగాళ్లను అభినందించడానికి మైదానంలోకి వచ్చాడు. నేరుగా పంత్ దగ్గరికి వెళ్లి అతడిని హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ రెండవ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపుకు కీలకంగా మారిన శార్దూల్ ఠాకూర్ కి దండం పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది ఈ ఫోటో చూసి శార్దూల్ ఠాగూర్ ని అభినందిస్తున్నారు.
Sanjiv Goenka bowing down to the Lord – Shardul Thakur. 🙇♂️ pic.twitter.com/Wkp3tQK90U
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2025