Snehit Reddy – U19 : ఆ అబ్బాయి పేరు స్నేహిత్ రెడ్డి…ఊరు విజయవాడ.
అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొడుతున్నాడు. ఇంతకీ టీమ్ ఇండియా తరఫున కాదండోయ్.. న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే 125 బంతుల్లో 147 పరుగులు చేసి ఔరా అనిపించాడు. నేపాల్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి శభాష్ అనిపించుకున్నాడు.
స్నేహిత్ ఆరునెలల వయసులోనే ఆ కుటుంబం న్యూజిలాండ్ వెళ్లింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది. స్నేహిత్ రెడ్డి అక్కడే విద్యాభ్యాసం చేశాడు. క్రికెట్ కూడా అక్కడే నేర్చుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 17 ఏళ్ల స్నేహిత్ ప్రస్తుతం బ్యాటర్ గానే కాదు ఆల్‌రౌండర్ గా కూడా రాణిస్తున్నాడు.
సెంచరీ చేసిన వెంటనే శుభ్ మన్ గిల్ స్టయిల్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తనకి గిల్ అంటే ఇష్టమని, ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పాడు. దీంతో అందరి ద్రష్టి స్నేహిత్ పై పడింది. అందరూ తన గురించి తెలుసుకోవడానికి నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో అదరగొడుతుంటే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ లో సెలక్ట్ అయ్యాడు. ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసి దుమ్ము దులిపాడు.
స్నేహిత్ రెడ్డితో పాటు భారతీయ మూలాలున్న మరో కుర్రాడున్నాడు. అతని పేరు ఒలివర్ తెవాతియా. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఢిల్లీలో పుట్టిన 18 ఏళ్ల ఒలివర్.. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు తరఫున అండర్ 19లో ఆడుతున్నాడు.
ఇక ప్రధానంగా కివీస్ జట్టులో అయితే బెంగళూరుకు చెందిన రచిన్ రెడ్డి ఉన్నాడు. 2023 వరల్డ్ కప్ లో 3 సెంచరీలు చేసి, 578 పరుగులతో అదరగొట్టాడు. అంతేకాదు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ సారథ్యంలో ఆడనున్నాడు.
వీరి ముగ్గురితో పాటు నాల్గవ వాడు న్యూజిలాండ్ స్పిన్నర్ కేశవ్ మహరాజు కూడా ఉన్నాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో శుభాకాంక్షలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.
వన్డే వరల్డ్ కప్ లాగే, అండర్ 19లో కూడా కివీస్ కప్ కొట్టలేదు. ఈసారైనా తీసుకురావాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం సూపర్ సిక్స్ కి అర్హత సాధించింది. ఆఫ్గనిస్తాన్, నేపాల్ పై విజయం సాధించి పాకిస్తాన్ పై ఓడింది. మరి సీనియర్లలా చివరి మ్యాచ్ ల్లో ఒత్తిడితో చేతులెత్తేస్తారా? లేక కప్ తీసుకువస్తారా? అనేది అనుమానంగానే ఉంది.