BigTV English

Suryakumar: సూర్య ప్రతాపం.. మనిషి కాదు మెషిన్.. క్రికెట్ ఏలియన్..

Suryakumar: సూర్య ప్రతాపం.. మనిషి కాదు మెషిన్.. క్రికెట్ ఏలియన్..

Suryakumar: పిచ్చ కొట్టుడు, వీరబాదుడు, ఇరగదీసుడు, చీల్చి చెండాడుడు.. ఇవీ క్రికెట్లో బ్యాట్స్‌మెన్ విధ్వంసం గురించి మాట్లాడే మాటలు. ఇవన్నీ ఒకప్పుడు టీమిండియాలో విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కు వాడేవారు.. ఇప్పుడు బౌలర్ల భరతం పడుతున్న బ్యాటర్ అంటే.. ఒక్క ఇండియాలోనే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పే ఒకే ఒకపేరు.. సూర్యకుమార్ యాదవ్.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త షాట్స్‌ను ఇంట్రడ్యూస్ చేసి.. క్రికెట్ ప్రేమికులను అబ్బురపరుస్తున్నాడు.. ఎక్కడా.. ఎప్పుడూ.. ఎవరూ ఆడని అతని షాట్స్‌ చూసి క్రికెట్‌ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సూర్య బారిన పడిన బౌలర్లు.. ఆ వీరదంచుడుని చూసి నోరెళ్లబెడుతున్నారు. ఎవరికీ సాధ్యం కానీ ఆటతీరుతో అదరహో అనిపిస్తున్నాడు సూర్య. ఇంతకీ అతను ఈ షాట్స్ ఎలా ఆడగలుగుతున్నాడు..? ఈ స్థాయికి రావడానికి అతను ఎలాంటి సాధన చేశాడు..?


టీమిండియాలో అతనో మిస్టర్‌ 360.. ఏ బంతిని ఎలా కొడతాడో తెలియకుండా మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపించే మిస్టర్ కూల్‌… పేసరైనా, స్పిన్నరైనా.. మ్యాచ్ ఎక్కడైనా.. బంతి ఏదైనా.. ఆన్‌సైడ్‌ కొడతాడో.. ఆఫ్‌సైడ్‌ మళ్లిస్తాడో.. మిడ్ ఆన్‌కు తరలిస్తాడో.. స్క్యేర్ లెగ్ వైపు సిక్సర్‌గా పంపిస్తాడో తెలీదు.. ఏ బౌలరైనా లెక్కచేయడు.. మైదానంలో 360 డిగ్రీల్లోనూ బాదుడే బాదుడు.. ఇలా సాగుతుంది అతని బ్యాటింగ్ శైలి. ఇంత చెప్పాక కూడా అతనెవరో ఇంకా చెప్పాలా..?

ఒకప్పుడు టెస్టులు.. మధ్యలో వన్డేలు… ఇప్పుడు టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను శాసిస్తోంది. ఆటగాళ్లు సైతం అందుకు తగ్గట్లుగానే సిద్ధమవుతున్నారు. ఆధునిక క్రికెటర్లు వినూత్న షాట్లతో పొట్టి క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో జెంటిల్‌మెన్‌గేమ్‌లో ఆటగాళ్లలో దాగున్న నైపుణ్యాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో సాంప్రదాయ షాట్లతో పాటు.. సరికొత్త ఆటతీరుతో అదరగొడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్.. తిలకరత్నే దిల్షాన్.. కెవిన్ పీటర్సన్..ఏబీ డివిలియర్స్‌.. బ్రెండన్ మెకల్లమ్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌.. ఈ కోవకే చెందుతారు. అయితే వీరందరికీ లేటెస్ట్ వెర్షన్ మాదిరి ఆటతీరుతో.. ఊహకే అంతు చిక్కని షాట్లతో చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.


భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య కుమార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. టీ20ల్లో కేవలం 550 బంతుల్లోనే వెయ్యి పరుగులు చేశాడంటే.. సూర్య జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనతి కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా అగ్రస్థానానికి చేరుకుని నయా చరిత్ర లిఖించాడు. ఎంతటి బలమైన ప్రత్యర్థి అయినా సరే.. బౌలింగ్ చేసేది ఎంతటి భీకరమైన బౌలరైనా సరే… ఊచకోత కోయడం ఒక్కటే సూర్యకు తెలుసు. ఇప్పటివరకు చూసిన క్రికెటర్లకు భిన్నంగా సూర్య క్రీజ్‌లో క్షణాల్లో కుదురుకుంటాడు. అలాగే తను ఎదుర్కొనే తొలి రెండు మూడు బంతుల్లోనే పిచ్ పరిస్థితిని.. బౌలర్ల మైండ్ సెట్‌ను అంచనా వేయడం అతడి ప్రత్యేకత. ఇక ఆ తర్వాత బౌలర్ ఎవరైనా సరే.. క్రికెటింగ్ షాట్లు ఆడుతూనే.. మిస్టర్ 360 గా పిలుచుకునే ఏబీ డీవిలియర్స్ ను తలదన్నేలా వైవిధ్యభరిత షాట్లతో విరుచుకుపడతాడు. బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. స్కోరుబోర్డ్‌ను ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు.. తాజాగా న్యూజిల్యాండ్‌తో రెండో టీ20లో తన రెండో సెంచరీ బాది టీమిండియా భారీ స్కోరు సాధిచడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక సూర్య బ్యాటింగ్‌ స్టైల్‌ చూస్తే.. మోకాళ్ల మీద కూర్చొని ఫైన్‌ లెగ్‌లో కొట్టే సిక్సర్లు.. స్కూప్‌తో కీపర్‌ మీదుగా సంధించే బౌండరీలు.. ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా సాధించే సిక్సర్లను చూడటానికి రెండు కళ్లూ చాలవు.. రకరకాల షాట్లతో స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్లుగా రెప్పపాటులో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలడు సూర్య. టీ20 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆడిన షాట్స్‌ను చూసి క్రికెట్‌ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు అతని ఊచకోత ఎలా ఉంటుందో..

ఇక టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సూర్య బ్యాటింగ్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. దిగ్గజాలతో పాటు క్రికెట్ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. సఫారీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ రిటైరయ్యాక.. అతని లేని లోటును సూర్య భర్తీ చేస్తున్నాడని క్రికెట్‌ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×