Team India: ఒక ప్రయోగం చేశామంటే, ఒకసారి చేయాలి.. రెండుసార్లు చేయాలి.. అంతేకానీ ఫెయిల్ అవుతున్న ప్రతిసారి అదే పని చేయడం సరికాదనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకని అంటారా? టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఓపెనర్లతో చేస్తున్న ప్రయోగం సరికాదని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఎప్పుడూ ఫస్ట్ డౌన్ వచ్చే విరాట్ కొహ్లీని ఓపెనింగ్ పంపి, టీమ్ ఇండియా భారీ మూల్యం చెల్లిస్తోందని అంటున్నారు. ఏదో అదృష్టవశాత్తూ మ్యాచ్ లు గెలుస్తుంది కాబట్టి, సరిపోయింది కానీ, లేదంటే ఈ పాటికి జనమంతా టీమ్ మేనేజ్మెంట్ ని దుమ్మెత్తిపోసేవారని అంటున్నారు. నిజాయితీగా చెప్పాలంటే ఐర్లాండ్ పైనే మనోళ్లు సాధికారికంగా ఆడి విజయం సాధించారు.
పాకిస్తాన్, అమెరికా రెండు జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో కూడా ఒకింత అదృష్టంపై ఆధారపడే గెలిచింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. నిజానికి ఇద్దరు సీనియర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా రావడం వల్ల జట్టుకి లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అంటే ఒకరకంగా నష్టం, ఒకరకంగా లాభం కూడా అని అంటున్నారు.
నష్టం అంటే… వీళ్లిద్దరూ అవుట్ అయిపోతే అనుభవం లేని కుర్రాళ్లపై భారం పడుతోంది. ఈ కఠినమైన పిచ్ లపై, దెబ్బలు తగిలించుకుంటూ జీవన్మరణ పోరాటంగా భావించి ఆడుతున్నారు. లాభం ఏమిటంటే, వీరిని చివరి వరకు ఉంచి బాల్స్ జిడ్డు ఆడుతూ ఉంటే, మ్యాచ్ పై టెన్షను పెరిగిపోతుంది. మొదలెట్టినప్పుడే ముగించేస్తే తాడోపేడో తేలిపోతుందని కూడా అంటున్నారు.
ఈ ప్రయోగం ద్వారా టీమ్ ఇండియాలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఉన్నారు. మిగిలినవాళ్లందరూ ఆల్ రౌండర్ల కోటాలో ఉన్నవారే. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇలా అందరూ అంతే. నిజానికి రిషబ్ పంత్ ని ప్రమోట్ చేయడం హాస్యాస్పదమని అంటున్నారు. అయితే తను ఆడుతున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమిటి పరిస్థితి అని అడుగుతున్నారు.
పాకిస్తాన్ మ్యాచ్ పై త్వరత్వరగా సీనియర్లు అయిపోవడంతో దిక్కులేనట్టు అక్షర్ పటేల్ ని సెకండ్ డౌన్ పంపించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ , శివమ్ దుబె తక్కువ పరుగులకే అయిపోయారు. అమెరికా మ్యాచ్ లో మళ్లీ తిన్నగా పంపించేసరికి సూర్య కాసేపు క్రీజులో కుదురుకుని, బ్యాట్ ఝులిపించాడు. శివమ్ దుబెకి కూడా అవకాశం చిక్కింది. ఎవరిని ఎలా ఆడించాలో తెలియకుండా, ప్రతి మ్యాచ్ లో అనవసర ప్రయోగాలు ఎందుకని అంటున్నారు.
Also Read: ఒంటిచేత్తో గెలిపించిన సూర్యకుమార్
దయచేసి సూపర్ 8లో నైనా కొహ్లీని ఫస్ట్ డౌన్ పంపించమనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. లేదంటే రిషబ్ పంత్ ని ఓపెనింగ్ తీసుకువెళ్లమని అంటున్నారు. ఎలాగూ తను మొదటి ఓవర్ లోనే బ్యాట్ పట్టుకుని వచ్చేస్తున్నాడు కదా…ఒకట్రెండు బాల్స్ వరకు ఆగడం ఎందుకని అంటున్నారు. టీమ్ మేనేజ్మెంట్ దిక్కుమాలిన ప్రయోగాలతో కొహ్లీ ఆటను నాశనం చేస్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.