T20 World Cup : T-20 వరల్డ్ కప్ లో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లే ఉత్కంఠ భరితంగా జరుగుతుండటంతో… ఇక సూపర్ 12 మ్యాచ్ లు ఎంత హైటెన్షన్ తో సాగుతాయో చూద్దామని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ… ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్-పాక్ ఫైట్… వరుణుడి కారణంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభంకానుంది. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు 90 శాతానికి పైగా ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. దాంతో… ఆ రోజు వర్షం పడకుండా మ్యాచ్ జరిగి… ఏ వరల్డ్ కప్ లోనూ పాక్ పై ఓటమి లేని టీమిండియా… ఆ రికార్డును కాపాడుకోవాలని… ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
ఇప్పటి వరకూ జరిగిన వన్డే వరల్డ్ కప్ ల్లో… భారత్-పాక్ మధ్య 7 మ్యాచ్ లు జరగ్గా… అన్నింటిలోనూ టీమిండియాదే విజయం. అలాగే ఇప్పటివరకు జరిగిన T-20 వరల్డ్ కప్ ల్లో… దాయాదుల మధ్య 5 మ్యాచ్ లు జరగ్గా… ఐదింటిలోనూ భారతే గెలిచి సంబరాలు చేసుకుంది. ఇందులో ఒక మ్యాచ్ తొలి టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా. అందులో పాక్ పై 5 పరుగుల తేడాతో గెలిచిన ధోనీ సేన… టీ-20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.
సూపర్-12లో శనివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌కు కూడా వర్షం బెడద తప్పేలా లేదు. శనివారం సిడ్నీలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణశాఖ వెల్లడించింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో… ఆసీస్, కివీస్ అభిమానులు సిడ్నీ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంటున్నారు.