Virat Kohli : ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్ లో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో మొదటి టీ 20లో విరాట్ కొహ్లీ ఆడలేదు. రెండో టీ 20లో ఆడి, 5 ఫోర్లు కొట్టి 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. తర్వాత మూడో టీ 20లోకి వచ్చేసరికి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ విషయంలో కొహ్లీకి అండగా నిలిచాడు. తన డిక్షనరీలో తనకి నచ్చని ఏకైక పదం..డకౌట్ అని అన్నాడు.
అయితే అందరూ విరాట్ కొహ్లీని బ్యాటర్ గానే చూస్తారు. అభిమానిస్తారు. కానీ తను మాత్రం అలా కాదు. ఆటలో ప్రతీ విభాగంలో భాగస్వామ్యం కావాలని అనుకుంటాడు. నిజానికి సీనియర్ ఆటగాళ్లను లాంగ్ ఆన్ లో ఉంచరు. ఎందుకంటే వయసు రీత్యా వారిని గౌరవిస్తూ స్లిప్ లేదా మిడాన్ లో ఉంచుతారు. కానీ విరాట్ మాత్రం షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ కావాలని అడిగి మరీ తీసుకున్నాడని కోచ్ దిలీప్ తెలిపాడు.
అలా ఆఫ్గనిస్తాన్ తో తాను ఆడిన రెండు మ్యాచ్ ల్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఇక మూడో టీ 20లో అయితే తను 58 మీటర్లు గాల్లోకి ఎగిరి ఒక సిక్సర్ ని ఆపాడు. నిజానికి అక్కడ మిగిలిన 5 పరుగులే టీమ్ ఇండియా విజయానికి దోహదపడ్డాయి. అలాగే రన్నింగ్ క్యాచ్ ఒకటి అందుకున్నాడు.
నిజానికి యువత అందరికీ కూడా విరాట్ కొహ్లీ ఆదర్శంగా ఉంటాడు. ఫిట్ నెస్ విషయంలో, ఇంకా ఆట పట్ల అంకితభావంలో ఇలా పలు అంశాల్లో వారికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఇదంతా ఎందుకంటే విరాట్ ఈ సిరీస్ లో బ్యాటర్ గాఫెయిలైనా బెస్ట్ ఫీల్డర్ గా అవార్డు అందుకున్నాడు. అంతేకాదు వరల్డ్ కప్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బెస్ట్ ఫీల్డర్ అవార్డుని ఇస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రతీ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని ఇస్తోంది. అది ఈసారి విరాట్ కొహ్లీని వరించింది.
అయితే మూడు టీ 20లు ఆడి, అటు బ్యాటింగ్ లో, ఇటు ఫీల్డింగ్ లో చురుకుగా కదిలి, అద్భుతమైన క్యాచ్ లు అందుకున్న రింకూ సింగ్ కి ఈ అవార్డు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ తనకన్నా ఒక్క శాతం కొహ్లీ ముందుండటంతో అతన్నే ఈ అవార్డు వరించిందని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపాడు.
సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారని కొనియాడాడు. అందరికీ ఆదర్శంగా నిలిచే కొహ్లీకే అవార్డు ఇవ్వడం న్యాయమని దిలీప్ అన్నాడు.