
WTC Final : భారత్- ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. బుధవారం ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత నెల చివరి వరకు ఐపీఎల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు మజాను ఇచ్చాయి. ఇప్పుడు భారత్- ఆసీస్ టెస్ట్ మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది.
ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ఇందులో గెలిచిన జట్టుకు ఛాంపియన్‌షిప్ గదను అందిస్తారు. అలాగే ప్రైజ్‌మనీ కూడా దక్కుతుంది. ఐపీఎల్ కు ముందుకు ఆసీస్‌పై బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. అదే జోష్ తో WTC ఫైనల్ కు సిద్ధమైంది.
భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బరిలోకి దిగుతారు. ఫస్ట్ డౌన్ లో నయావాల్ పుజారా, ఆ తర్వాత రన్ మిషన్ విరాట్ కోహ్లి వస్తారు. ఐదో స్థానం రహనేకు దక్కే అవకాశం ఉంది. కీపర్ గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ల్లో ఒకరికి చోటు దక్కుతుంది. భరత్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపిస్తుందని తెలుస్తోంది. ఇద్దరు స్పిన్నర్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ , జడేజా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావచ్చు. అలాగే పేసర్లు షమీ, సిరాజ్ జట్టులో ఉంటారు. మూడో పేసర్ గా ఉమేష్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ లో ఒకరికి స్థానం దక్కుతుంది.
అటు ఆస్ట్రేలియా కూడా అన్ని విభాగాల్లో బలంగా ఉంది.ఫైనల్‌కు ముందు ఆ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించుకుంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో కోచ్‌గా ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 -2014 వరకు ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లవర్ ఉన్నాడు. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టు మూడు సార్లు యాషెస్ విజేతగా నిలిచింది.