Telangana: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాజ్ భవన్ తెలిపింది. బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉందని పేర్కొంది.
పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళ సమస్య తలెత్తింది. రిజర్వేషన్లపై రాజ్ భవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ బిల్ ఇంకా పెండింగ్ లోనే ఉందని రాజ్ భవన్ వివరించింది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది.
ALSO READ: Telangana Railway Projects: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ హైకోర్టు గడువు కూడా నిర్ణయించింది. జూలై చివరి వారం నాటికి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశానికి జారీ చేసిన విషయం తెలిసిందే..
రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో నిర్వహించిన కుల గణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి కూడా పంపింది. అయితే, రాష్ట్రం చేసిన అభ్యర్థనకు కేంద్రం ఇంకా స్పందించకపోవడంతో, పెరిగిన బీసీ కోటాతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు.. ఇప్పుడు గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంది.