Abandon Crippled Woman: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కనీసం కదలడానికి కూడా సత్తువ లేని 85 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. వేములవాడ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు వారం రోజులుగా లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ దగ్గరే ఆ వృద్ధురాలు ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. మాట్లాడలేక, కదలలేక దిక్కు తోచని స్థితిలో వృద్ధురాలు ఉందని అవేదన వ్యక్తం చేశారు. దయనీయ స్థితిలో ఉన్న ఆమెను చూస్తే బాధాకరంగా ఉందని అంటున్నారు.
వృద్ధురాలి వివరాలు తెలుసుకొని తిరిగి ఇంటికి పంపించేందుకు అక్కడి దుకాణదారలు, స్థానికులు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. ఎన్ని సార్లు అడిగినా మాటలు అర్థం చేసుకోలేని స్థితిలో వృద్ధురాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో, తనను ఎవరు తీసుకొచ్చారో కూడా చెప్పలేకపోతోందని స్థానికులు వెల్లడించారు. ఎలా అడిగినా వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఆమె ఇబ్బంది పడుతోంది.
దీంతో ఆటో డ్రైవర్ సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వృద్ధురాలికి సహాయం చేశారు. స్నానం చేయించి బట్టలు వేశారు. అనంతరం ఆహారం తినిపించారు. అయితే వయసు పైబడిపోయిన అమె ఆలనాపాలనా చూసుకోవడం ఇష్టం లేక కుటుంబసభ్యులు వదిలేసి వెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కని పెంచిన తల్లిపై కొంచం కూడా శ్రద్ధ చూపని కొడుకుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమె కుటుంబ సభ్యులు వచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తే బాగుంటుందని అంటున్నారు. లేదంటే వృద్ధురాలి బాగోగులు చూసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తున్నారు.