Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో‘ధాన్యం కొనుగోళ్లు’ అంశం రాజకీయ పార్టీల మధ్య ఫైట్ కు తెర లేపింది. రికార్డు స్థాయి దిగుబడి ఒకవైపు సంతోషాన్నిస్తుంటే, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం మాత్రం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.ఈ ఏడాది తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అనుకూలించిన వాతావరణం,నీటి లభ్యతతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయింది.దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గ్రేడింగ్, మిల్లింగ్ ప్రక్రియల్లో జరుగుతున్న ఆలస్యం రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ భారీ దిగుబడే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను క్యాష్ చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.రాష్ట్రవ్యాప్తంగా ‘కల్లాల యాత్ర’కు శ్రీకారం చుట్టి వివాదానికి తెరలేపింది.
కొనుగోలు కేంద్రాల్లో తూకాలలో మోసాలు జరుగుతున్నాయని,మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని,మిల్లుల వద్ద లారీల నిలిపివేతతో రైతులు రోడ్లపైనే రాత్రులు గడపాల్సి వస్తోందని బీజేపీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనల్లో ధ్వజ మెత్తుతున్నారు.అయితే బీజేపీ కల్లాల యాత్రతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. కాషాయం, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ లీడర్లు పరస్పరం కౌంటర్లకు దిగుతున్నారు.”కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇస్తున్నా,రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల నిర్వహణను గాలికొదిలేసింది.కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి.” అంటూ బీజేపీ నేతలు చెబుతుండగా, “కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధాన్యం సేకరించడంలో కావాలనే కొర్రీలు పెడుతూ, ఇక్కడ పొలిటికల్ మైలేజ్ కోసం డ్రామాలు ఆడుతోంది.” అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.
బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు, రైతులు ప్రతిపక్షాల మాయలో పడకుండా చూసేందుకు అధికార హస్తం పార్టీ రంగంలోకి దిగుతోంది. రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది.విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా కల్పిస్తోంది.కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్ల దగాను అడ్డుకునేందుకు, తూకాల్లో తేడాలు రాకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం చేదని పండిన పంటను కొనుగోలు చేసి మద్ధతు ధర ప్రకటించే బాధ్యత రాష్ట్ర సర్కారే అంటూ హామీ ఇవ్వనున్నది. రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్ సెల్, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి లీడర్లు చొరవ చూపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Also Read: Hyderabad Weather: ఆకాశం ముసిరేసింది.. హైదరాబాద్ సిటీ ముసుగేసింది, ముందస్తు రుతుపవనాలు
2025-26 రబీ ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.25 మే 2026 నాటికి రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 18 వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.6,462.73 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల సంఖ్య పట్టికలో ఉన్న అన్ని రబీ సీజన్ల కంటే ఎక్కువ. 2021-22లో 6,609, 2022-23లో 7,037, 2023-24లో 7,178, 2024-25లో 8,378 కేంద్రాలు ఉండగా, 2025-26లో 8,575 కేంద్రాలు ఏర్పాటు చేశారు.గత ప్రభుత్వంలోని 2021-22 రబీతో పోలిస్తే ఈ ఏడాది మే 18 నాటికి కొనుగోళ్లు గణనీయంగా ఎక్కువ అని సర్కార్ రిపోర్టు లో పేర్కొన్నది. గతంలో మే 18 నాటికి 21.79 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కాగా, ఈసారి 40.03 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2021-22 రబీతో పోలిస్తే ఈ ఏడాది మే 18 వరకు 18.24 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం కొనుగోలు జరిగింది.
గత ప్రభుత్వంలోని 2022-23 రబీతో పోలిస్తే కూడా ఈ ఏడాది కొనుగోళ్లు ముందంజలో ఉన్నాయి. 2022-23లో మే 18 నాటికి 30.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కాగా, ఈసారి 40.03 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.2022-23 రబీతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 9.63 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు.ప్రస్తుత ప్రభుత్వంలోని 2023-24 రబీతో పోలిస్తే కూడా ఈ ఏడాది మే 18 నాటికి పురోగతి ఎక్కువగా ఉంది. 2023-24లో అదే తేదీ నాటికి 36.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కాగా, ఈసారి 40.03 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది.2023-24 రబీతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 4.02 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనుగోలు చేశారు.2024-25 రబీలో మే 18 నాటికి 54.18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 40.03 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది. అయితే ఈసారి కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.మొత్తంగా చూస్తే, 2025-26 రబీ సీజన్‌లో 8,575 కేంద్రాల ద్వారా 18 మే వరకు 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, రూ.6,462.73 కోట్ల చెల్లింపులు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కళ్లు తెరిచి చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు.
Also Read: Debris Dump: హైటెక్ సిటీలో ఐదంతస్తుల చెత్త గుట్ట!
యాసంగి పంటకు సంబంధించి రాష్ట్రంలో మొక్కజొన్న అంచనా ఉత్పత్తి 43.18 లక్షల మెట్రిక్ టన్నులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతాయని అంచనా వేస్తుంది. ఇక ప్రభుత్వం జిల్లాల వారీగా మొత్తం 14.89 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.మే 20వ తేదీ నాటికి మొత్తం 11.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది.కొనుగోలు చేసిన దాంట్లో 9.53 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించారు. ఇంకా 2.01 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించాల్సి ఉంది.కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. తర్వాతి స్థానాల్లో నాగర్‌కర్నూల్ — 1.55 లక్షల మెట్రిక్ టన్నులు, వరంగల్ — 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ — 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
నిల్వల విషయంలో మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అవసరం. ప్రస్తుతం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అందుబాటులో ఉంది. ఎక్కడికక్కడే సరిపడే నిల్వ స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా ఈరోజు గుర్తించిన నిల్వ స్థలం 27 వేల మెట్రిక్ టన్నులు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 2.48 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.మొక్క జొన్న కొనుగోళ్లకు మొత్తం 3.10 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇప్పటివరకు 2.42 కోట్ల బ్యాగులు సరఫరా అయ్యాయి. ఇంకా 67.84 లక్షల గన్నీ బ్యాగులు సర్దుబాటు చేయనున్నారు.ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో హమాలీల కొరత, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రవాణా సమస్యలతో కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి.