Addanki Dayakar: సీఎల్పీ మీడియా హాల్‌లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు దక్షిణ భారతదేశానికి శరాఘాతంగా మారబోతోందని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా, ముఖ్యంగా మహిళా బిల్లు ముసుగులో కేంద్రం డీలిమిటేషన్ పేరుతో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. దీని ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దేశాన్ని శాసించాలని చూస్తోందన్నారు. ఇది దేశాన్ని రెండు ముక్కలు చేసే కుట్రలా కనిపిస్తోందని తెలిపారు. అందుకే మోదీని కొందరు ‘డివైడర్ ఆఫ్ ది ఇండియా’గా చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్, మోదీ డీల్ ఏంటి?
ఈ డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణ చేశారు. మోదీ, కేసీఆర్ మధ్య ఉన్న హాట్‌లైన్ ద్వారానే ఈ మద్దతు నడుస్తోంది. ఇద్దరి మధ్య అసలు ఎంత డీల్ కుదిరిందో కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఈరోజు బట్టబయలు కాబోతోందన్నారు. భవిష్యత్తులో కలసి పోయే పొత్తులో భాగంగానే ఇద్దరూ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. దక్షిణాదికి నష్టం జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మద్దతు ఇస్తున్నారని, జగన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో కూడా స్పష్టం చేయాలని కోరారు.
చరిత్రహీనులుగా మిగిలిపోతారు
నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజునే రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పతనం ఖాయం కావడంతోనే ఇలాంటి బిల్లు తెచ్చారని, కానీ బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా మొత్తంగా మునగబోతోందని జోస్యం చెప్పారు. రాజకీయంగా ప్రాంతాల అస్తిత్వానికి ఇంత నష్టం జరుగుతున్నా దక్షిణాదిలోని పార్టీలు, నేతలు స్పందించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల పార్టీలన్నీ కలసి డీలిమిటేషన్ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. ఒకే ఇంట్లో 70 తులాల బంగారం మాయం!