Child Marriages: సామాజిక అవగాహన పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో బాల్య వివాహాల సంఖ్య ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. తాజాగా వెల్లడైన గణాంకాలు రాష్ట్రంలో ఈ సామాజిక రుగ్మత తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. 2024 నుండి 2026 నవంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1,497 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 31 పోలీస్ యూనిట్ల పరిధిలో ఈ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి తెలంగాణను పూర్తిస్థాయి ‘బాల్య వివాహ రహిత రాష్ట్రం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, పోలీస్ శాఖ సంకల్పించాయి.
బాల్య వివాహాల నివారణకు మరింత కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు కనీస అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తరహా ఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఎటువంటి జాప్యం లేకుండా వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆమె ఆదేశించారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్-బెయిలబుల్ నేరాలని డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ వివాహాల ముసుగులో ఎక్కడైనా లైంగిక నేరాలు జరిగినట్లు తేలితే, నిందితులపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని సూచించారు.
మరోవైపు బాల్య వివాహాలను ఆదిలోనే అరికట్టేందుకు విద్యాశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల నుంచి బాలికలు మధ్యలోనే చదువు మానేసి వెళ్లిపోయేవారిపై (డ్రాపౌట్స్) ప్రధానంగా దృష్టి సారించాలని చెబుతున్నారు. అలాంటి పిల్లల వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలను నివారించవచ్చని భావిస్తున్నారు. కేవలం బాల్య వివాహాలే కాకుండా వీటి వెనుక దాగి ఉండే మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ లైంగిక దోపిడీ వంటి ముప్పులపై కూడా తల్లిదండ్రులు, సమాజం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనకు ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2027 ఫిబ్రవరిలో ఒక భారీ రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, 2030 లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన వ్యూహాలను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఈ సామాజిక దురాచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!