Women Reservation: తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్నారు. పైగా తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో సీట్ల పెరుగుదలపై అంచనా
ప్రస్తుతం దేశంలో 140 కోట్ల జనాభా ఉందని, 1991 నాటి 54 కోట్ల జనాభాకు అనుగుణంగా ఉన్న 543 సీట్లను ఇప్పటికీ కొనసాగించడం సరికాదని రాంచందర్ రావు పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత స్థానాల్లో 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ లెక్కన తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 175కు, లోక్‌సభ స్థానాలు 25కు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అసమానతలు తొలగించి, నియోజకవర్గాలను శాస్త్రీయంగా విభజించేందుకే డీలిమిటేషన్ తీసుకొస్తున్నట్లు వివరించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
డీలిమిటేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టసభల్లో సీట్లు పెరుగుతాయని రాంచందర్ రావు అన్నారు. వెనుకబడిన వర్గాల వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావద్దనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కొందరికి లబ్ధి చేకూర్చేలా నియోజకవర్గాల విభజన చేసిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.
పూలే ఆశయ సాధన దిశగా అడుగులు
జ్యోతీరావ్, సావిత్రిబాయి పూలే ఆశయాల మేరకు మహిళలకు విద్యావకాశాలతో పాటు రాజకీయ అభ్యున్నతి కల్పించాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు. ఈ పార్లమెంట్ సెషన్స్‌లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నామని, దీనికి దేశవ్యాప్తంగా మహిళల మద్దతు ఉందన్నారు. గతంలో రాజీవ్ గాంధీ దీనికి ఒప్పుకోలేదని, ఇప్పుడు ఇండీ కూటమి నేతలు మద్దతిస్తున్నట్టే నటిస్తూ అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్‌లో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లును తాము స్వాగతిస్తున్నట్లు రాంచందర్ రావు స్పష్టం చేశారు.
Also Read: మీరు ఫోన్‌ను వాడుతున్నారా? లేక మీ ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా?