E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. తెలంగాణలో ఈ నాలుగు జిల్లాలకు నీటి గండం!

డేంజర్ బెల్స్.. తెలంగాణలో ఈ నాలుగు జిల్లాలకు నీటి గండం!
Advertisement

Singur Reservoir: స్వేచ్చ బ్యూరో: సింగూరు జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో నాలుగు జిల్లాల తాగునీటి భద్రతపై ఆందోళన మొదలైంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రధాన ఆధారంగా ఉన్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 1.95 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. 29.91 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో నీరు ఈ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాకపోవడం, వచ్చిన కొద్దిపాటి నీటిని ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో దిగువకు విడుదల చేయాల్సి రావడం నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల తాగునీటి అవసరాలను ఎలా తీర్చాలన్నది అధికారులకు సవాలుగా మారింది. ఇప్పటికే పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లను కేటాయించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 15 నుంచి డిసెంబరు 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది.

1.95 టీఎంసీలకు పడిపోయిన నిల్వలు

సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వలు ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. ఈనెల 23 నాటికి జలాశయంలో 1.95 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1717.93 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ అందులో ఏడు శాతానికీ తక్కువ. ఈ ఏడాది మంజీరా పరివాహక ప్రాంతంలో ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో సింగూరుకు కేవలం 3.56 టీఎంసీల వరద మాత్రమే వచ్చిందని అధికారులు వెల్లడించారు. గతేడాది భారీగా వరద ప్రవాహాలు వచ్చినప్పటికీ ప్రాజెక్టు భద్రతా చర్యలు, మరమ్మతుల కారణంగా నీటి నిల్వను పరిమితం చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ ఏడాది తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో లేకుండా పోయాయి.

మూడు నెలల అవసరాలెలా?

Advertisement

ప్రస్తుతం ఉన్న నీటితో రానున్న మూడు నెలల తాగునీటి అవసరాలను తీర్చడం ఎలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు, మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనూ అనేక గ్రామాలు ఈ నీటి వనరుపైనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు జలాశయంలో నీటి నిల్వలు 0.80 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి చేరితే సింగూరు నుంచి నీటిని తోడటం నిలిపివేయాల్సి ఉంటుందని జలమండలి అధికారులు గతంలో వెల్లడించారు. ఈనెల 24 నాటి అధికారుల అంచనా ప్రకారం మిగిలిన నీటిని పొదుపుగా వినియోగిస్తే డిసెంబరు 20 వరకు హైదరాబాద్‌కు సరఫరా కొనసాగించే అవకాశముంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో నాలుగు జిల్లాల్లోనూ గ్రామాలవారీగా నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.

Also Read: తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

రూ.120 కోట్లతో ప్రణాళిక

Advertisement

సింగూరుపై ఆధారపడిన నాలుగు జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లను కేటాయించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట ప్రైవేటు బోరుబావులను అద్దెకు తీసుకోవాలని, నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించాలని సూచించారు. చేతిపంపులు, సింగిల్‌ఫేజ్, త్రీఫేజ్ నీటి సరఫరా పథకాలు, గ్రామాల్లోని బావులను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ఆయా ప్రాజెక్టుల నుంచి నీరు సంవృద్ధిగా ఉందని నీటి సమస్యలు వచ్చే అవకాశం లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.అయితే ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే పరిష్కారానికి జిల్లాకు కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.

గోదావరి నీటిపై ఆధారం

సింగూరు నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా హైదరాబాద్, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే పైప్‌లైన్ అనుసంధాన పనులు చేపట్టారు. హైదరాబాద్‌కు గత మూడు రోజులుగామల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు 100 ఎంఎల్‌డీ నీరు ను ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. శాశ్వతంగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా పటాన్‌చెరు ప్రాంతానికి తొలుత 20 ఎంజీడీల నీటిని మళ్లించేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవసరాన్ని బట్టి దీనిని 40 ఎంజీడీలకు పెంచే అవకాశముంది. అయితే ఈ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించడంపై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబరు 31 వరకు స్పెషల్ డ్రైవ్..

రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ నెల 15 నుంచి డిసెంబరు 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మండల స్థాయి బృందాలు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 15 రోజులకు ఒకసారి మండల సమావేశం నిర్వహించి నీటి పరిస్థితులపై సమీక్షిస్తూ సంబంధిత రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తున్నారు. తొలి విడుత సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడిన నాలుగు జిల్లాల్లో ఈ డ్రైవ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతోందా? ఎన్ని గంటలు నీరు వస్తోంది? ఏ ప్రాంతాల్లో పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి? ఎక్కడ బోర్లు పనిచేయడం లేదు? ఎక్కడ భూగర్భ జలాలు అడుగంటాయి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు.

Also Read: 2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

64 గ్రిడ్ పంపులకు మరమ్మతులు

మిషన్ భగీరథ పరిధిలోని నీటి సరఫరా వ్యవస్థలో సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 64 గ్రిడ్ పంపులకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట మరిన్ని రిపేర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మోటార్ల మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీలు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తాగునీటి సరఫరాపై గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకొంటు ముందుకు సాగుతున్నారు.

ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుపైనే దృష్టి

సింగూరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో కేవలం నిధులు కేటాయించడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా చేపట్టే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయన్నది కీలకంగా మారింది. నాలుగు జిల్లాల్లో ఏ గ్రామానికి ఎంత నీరు అవసరం? ప్రస్తుతం ఏ వనరుల నుంచి సరఫరా జరుగుతోంది? ప్రత్యామ్నాయ బోర్లు, ట్యాంకర్ల ద్వారా ఎంత మేర నీటిని అందించగలరు? గోదావరి జలాల మళ్లింపు ఎప్పటికి పూర్తవుతుంది? అన్న అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరమవుతోంది. డిసెంబరు చివరి వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, నీటి కొరత ఏర్పడే గ్రామాలకు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. సింగూరులో మిగిలిన నీటిని పొదుపుగా వినియోగించడంతోపాటు, కొత్త నీటి వనరులను సిద్ధం చేయగలిగితేనే రానున్న నెలల్లో నాలుగు జిల్లాల తాగునీటి అవసరాలను సజావుగా తీర్చే అవకాశం ఉంటుంది. ఆదిశగా అధికారులు వేగంగా చర్యలు చేపడతారా? లేదా? అనేది చూడాలి.

Also Read: అంచనాలు తారుమారు.. ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధర, కొనుగోలుదారులకు షాక్

Tags

Related News

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. ఓటర్లను పాలకులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో యాపిల్ ఫస్ట్ స్టోర్, ముంబై- ఢిల్లీ తర్వాత..

స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

300 మందిని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. కాచిగూడ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు!

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×