తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎటూచూసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా మారాయి. రిజర్వేషన్ల ప్రకారం వార్డుల వారీగా ఆశావహుల నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎన్నికల ఇన్‌చార్జిలు దరఖాస్తులు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఫిల్టర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఫైనల్ జాబితాను పార్టీల అధిష్టానాలకు ఎన్నికల ఇన్‌చార్జులు పంపించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వందకుపైగా మున్సిపల్ వార్డులు, 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నేడు లేదా రేపటిలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తున్నది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్ర మంత్రి వర్గం సైతం ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సమ్మతించింది.ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా సర్కారుకు లేఖ రావడమే తరువాయి. అనంతరం దానికి సమ్మతిస్తూ ప్రభుత్వం మరో లేఖ రాయగానే.. ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ ప్రచార మెంబర్లకు సంబంధించిన డేటాను ఈసీకి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మిగతావారిని స్టార్ క్యాంపెనర్లుగా పరిగణించకుండా వారిని ప్రచారానికి అనుమతించరు.
మున్సిపల్ ఎన్నికలను అస్సలు లైట్ తీసుకోవద్దని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ నేతలకు ముందే స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నట్టు సమాచారం.ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు జిల్లాల్లో మంచి పట్టు ఉన్నది. బీజేపీకి మాత్రం పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉన్నది. దీంతో ఆయా పార్టీలు తాము ఎక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూసుకుని మరీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికలు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అధికార పార్టీలో మాత్రం మున్సిపల్ ఎన్నికల హడావుడి మాములుగా లేదు. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
Prakash Raj: “బాలీవుడ్ ఒక ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియం”.. సంచలన కామెంట్లు చేసిన ప్రకాష్ రాజ్
ఇక ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. లాబీయింగ్ చేసిన వారికి టికెట్లు ఇస్తే ఎన్నికల్లో విజయావకాశాలు , మెజార్టీ సీట్లు కోల్పోయే చాన్స్ ఉందని.. ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తే గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయని పార్టీలు నిర్ణాయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీల అధినాయకత్వాలు జిల్లా స్థాయి నేతలకు సూచించినట్టు తెలుస్తున్నది. ఒకవేళ తమపార్టీలో గెలుపు గుర్రాలు లేకపోతే పక్క పార్టీల నుంచి సైతం వారిని ఆహ్వానించి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు అందినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.